Beggar Accident -Cash Recovery: రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి! అతడి డబ్బాను చెక్ చేస్తే.. భారీ షాక్
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:05 PM
కేరళలో ఇటీవల మరణించిన ఓ యాచకుడి వద్ద రూ.4.5 లక్షల నగదు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అతడి డబ్బాలో ఈ డబ్బును పోలీసులు గుర్తించారు. అలప్పుళ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేరళలో తాజాగా ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ యాచకుడు మృతి చెందగా అతడి వద్ద రూ.4.5 లక్షల నగదు బయటపడింది. అలప్పుళ జిల్లా చారుమ్మూత్ టౌన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది (Kerala Beggar Accident - Cash Found).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యాచకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికులు అతడిని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి రికార్డుల్లో అతడి పేరును అనిల్ కిషోర్‌గా పేర్కొన్నారు. ఆ తరువాత అతడు ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని ఓ షాపు వద్ద స్థానికులు గుర్తించారు. అతడి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక యాచకుడికి చెందినదిగా భావిస్తున్న ఓ డబ్బా కూడా పోలీసులకు లభించింది. స్టేషన్‌లో దాన్ని తనిఖీ చేయగా అందులో భారీగా నగదు కనిపించింది. మొత్తం రూ.4.5 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చలామణిలోని కొన్ని రూ.2 వేల నోట్లతో పాటు విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయి.
కిశోర్ నిత్యం అదే ప్రాంతంలో కనిపిస్తుంటాడని స్థానికులు తెలిపారు. ఆహారం కోసం భిక్షాటన చేస్తుంటాడని అన్నారు. అయితే, అతడి వద్ద అంత స్థాయిలో డబ్బు ఉంటుందని మాత్రం తామెప్పుడూ ఊహించలేదని చెప్పారు. ఈ ఉదంతం తామందరినీ షాక్‌కు గురి చేసిందని పంచాయతీ సభ్యుడు ఫిలిమ్ ఉమ్మన్ తెలిపారు. యాచకుడి వద్ద లభించిన డబ్బును నిబంధనల ప్రకారం కోర్టుకు సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:
అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్
గుడ్లురిమి చూస్తున్న మహిళ.. ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే.. అసలు కథేంటంటే..