Working Age Population: జనాభా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్టు.. నెం.2, 3 స్థానాల్లో తెలంగాణ, ఏపీ
ABN , Publish Date - Sep 22 , 2025 | 07:45 AM
జనాభాలో ఉద్యోగ ఉపాధి పొందే వయసున్న వారి వాటా అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అక్కడ 15 -59 ఏళ్ల వయసున్న వారి వాటా 70.8 శాతం. ఆ తరువాతి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే (15-59 ఏళ్లు) వయసున్న వారి జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ టాప్‌లో నిలిచింది. దేశ రాజధాని జనాభాలో వీరి వాటా 70.8 శాతంగా ఉన్నట్టు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ స్టాటిస్టికల్ రిపోర్టు-2023లో తాజాగా వెల్లడైంది. ఇక దేశవ్యాప్తంగా జనాభాలో వీరి వాటా 66 శాతం. తెలంగాణలో 15-59 ఏళ్ల వయసున్న వారి వాటా 70.2 శాతం. 70.1 శాతం వాటాతో ఏపీ మూడో స్థానంలో ఉంది (Woking Age Population Delhi Tops).
దేశ జనాభాలో 0-14 ఏళ్ల వయసున్న చిన్నారుల వాటా తగ్గినట్టు కూడా ఈ గణాంకాలు చెబుతున్నాయి. 1971లో వీరి వాటా 41 శాతం కాగా 2023 నాటికి చిన్నారుల వాటా 24 శాతానికి పడిపోయింది. అయితే, బిహార్ జనాభాలో 14 ఏళ్ల లోపున్న చిన్నారుల వాటా అత్యధికంగా 32 శాతంగా ఉంది. కానీ వర్కింగ్ ఏజ్ (15-59 ఏళ్లు) జనాభా పరంగా బిహార్ మిగతా రాష్ట్రాల కంటే చివరన ఉండటం గమనార్హం (AP, TG working Age population Share).
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ, నగరాల మధ్య జనాభా పరంగా వ్యత్యాసాలు ఉన్నట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. అర్బన్ జనాభాలో 15-59 ఏళ్ల మధ్య వయసున్న వారి వాటా 68.6 శాతం కాగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది 64.6 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్ల లోపు చిన్నారుల వాటా 25.9 శాతంగా అర్బన్ ప్రాంతాల్లో ఇది 25.9 శాతంగా ఉంది (Sample Registration System 2023).
ఇక భారత జనాభాలో 60 ఏళ్లు పైబడి వారి వాటా 9.7 శాతం. ఇందులో మహిళలు 10.2 శాతం కాగా పురుషులు 9.2 శాతంగా ఉన్నారు. కేరళ జనాభాలో వృద్ధుల వాటా అత్యధికం. అక్కడ 15.1 శాతం మంది వయసు పైబడిన వారు ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో తమిళనాడు (14 శాతం), హిమాచల్ ప్రదేశ్ (13.2 శాతం) ఉన్నాయి. ఝార్ఖండ్, అస్సామ్, ఢిల్లీ జనాభాల్లో వృద్ధుల వాటా అత్యల్పంగా (7.6 -7.7 శాతం) ఉంది.
జనాభాలో స్త్రీపురుష వ్యత్యాసాలు కూడా ఈ గణాంకాల్లో స్పష్టంగా కనిపించాయి. 15-59 ఏళ్లు, 60 ఏళ్లకు పైబడిన వారు, 15 ఏళ్లు-64 ఏళ్ల మధ్య వారిలో మహిళల వాటా ఎక్కువ. కేవలం అస్సాం, జమ్మూ అండ్ కశ్మీర్‌లో మాత్రమే వృద్ధుల్లో పురుషుల వాటా అధికంగా ఉంది.
ఇవి కూడా చదవండి:
జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి