SC on Dog Menace: వీధి కుక్కల అంశంపై విచారణ.. సుప్రీం కోర్టు అసహనం.. కోళ్లు, మేకల ప్రాణాల మాటేంటని ప్రశ్న
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:07 PM
దేశంలో కుక్క కాటు ఘటనలు పెరగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క ప్రవర్తనను బట్టి అది ప్రమాదకరమైనదో కాదో చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ కేసుపై రేపు కూడా విచారణ కొనసాగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వీధి కుక్కల సమస్యపై ప్రస్తుతం విచారణ చేపడుతున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, ఎన్‌వీ అంజారీయాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. దేశంలో కుక్క కాటు కేసుల సంఖ్య పెరగుతుండటంపై సుప్రీం కోర్టు బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. జంతువుల సంఖ్య నియంత్రణకు సంబంధించిన నిబంధనల అమలులో అధికార యంత్రాంగం విఫలమైందని వ్యాఖ్యానించింది (SC Hearing on Street Dog Menace).
వీధి కుక్కల కారణంగా గత 20 రోజుల్లో ఇద్దరు న్యాయమూర్తులు యాక్సిడెంట్‌ల పాలపడ్డారని ధర్మాసనం పేర్కొంది. వారిలో ఒకరి వెన్నెముకకు గాయాలయ్యాయని తెలిపింది. జంతు హక్కుల కార్యకర్తల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ప్రస్తుతం వీధి కుక్కలు ఉంటున్న చోటు నుంచి షెల్టర్‌లకు తరలించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. స్థానికులు షెల్టర్ హోమ్స్ వరకూ వెళ్లి వీధి కుక్కలకు ఆహారం పెట్టరని తెలిపారు. జనావాసాల మధ్య వీధి కుక్కలను అనుమతించాలా? వద్దా? అన్న అంశం గేటెడ్ కమ్యూనిటీల వెల్ఫేర్ అసోసియేషన్లే నిర్ణయించాలని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. వీధి కుక్కలు జనావాసాల మధ్య తిరుగాడటాన్ని 90 శాతం మంది స్థానికులు వ్యతిరేకిస్తుంటే 10 శాతం మంది అనుకూలంగా ఉన్నారని చెప్పారు. జంతుప్రేమికులమంటూ రేపటి రోజున జనావాసాల మధ్యకు గేదెలను కూడా తీసుకొస్తారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సీనియర్ అడ్వకేట్లు కేకే వేణుగోపాల్, కోలిన్ గొన్జాల్వెస్, ఆనంద్ గ్రోవర్, సీయూ సింగ్ తదితరులు కూడా తమ వాదనలు వినిపించారు.
అన్ని వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్క కాటు కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుక్కలు ఏ మూడ్‌లో ఉన్నాయో, ఎప్పుడు కరుస్తాయో ఎవరు చెప్పగలరని ప్రశ్నించింది. శునకాల ప్రవర్తన ద్వారా ఏవి ప్రమాదకరమైనవో గుర్తించడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. విద్యాసంస్థలు, హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు తదితర ప్రాంతాల్లో కుక్క కాటు కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయని చెప్పింది. వీధి కుక్కల రక్షణపై పిటిషన్లు పెరుగుతున్న వైనంపై అసహనం వ్యక్తం చేసింది. ‘అందరూ శునకాల గురించే మాట్లాడతారు? కోళ్లు, మేకల గురించి ఎవరూ మాట్లాడరు? వాటివి ప్రాణాలు కావా?’ అని ప్రశ్నించింది. ఆయా ప్రాంతాల్లోని కుక్కలకు టీకాలు వేయించాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేసింది. రాత్రి సమయాల్లో రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులపైకి జంతువులు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా తేల్చి చెప్పింది. ఈ అంశంపై రేపు కూడా సుప్రీం కోర్టులో విచారణ కొనసాగనుంది.
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్