Vedanta: 75 శాతం సంపాదన దానం చేసేస్తా: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటన
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:47 PM
వేదాంతా గ్రూప్ అధిపతి, బిలియనీర్.. అనిల్ అగర్వాల్ మరోమారు తానిచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు అగ్నివేశ్ హఠాన్మరణం వేళ బాధాతప్త హృదయంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన జీవితంలో చీకట్లు కమ్మాయని..
ఆంధ్రజ్యోతి, జనవరి 8: వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తన ప్రతిజ్ఞను మరోసారి ధ్రువీకరించారు. తన సంపాదనలో 75 శాతాన్ని సమాజానికి దానం చేయాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆయన కుమారుడు అగ్నివేశ్ అగర్వాల్ (49 ఏళ్లు) అమెరికాలో గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో అనిల్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. అనిల్ అగర్వాల్ నికర సంపద 330కోట్ల డాలర్లు.
అగ్నివేశ్ స్కీయింగ్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో అనిల్ అగర్వాల్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'నా కుమారుడితో కలిసి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మా సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువను సమాజానికి ఇస్తాను. ఇకపై మరింత సరళ జీవితం గడుపుతాను' అని తెలిపారు.
'నా తనయుడు అగ్నివేశ్ ఎంతో త్వరగా మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. అతడి వయసు 49 ఏళ్లే. భవిష్యత్తు గురించి ఎన్నో కలలుండేవి. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన అగ్నివేశ్.. ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మమ్మల్ని విడిచివెళ్లిపోయాడు. జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా.. ఎంతో ఒదిగి ఉండేవాడు. ఒక ఫ్రెండ్‌లా నా వెంటే ఉండేవాడు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తోందని బలంగా నమ్మేవాడు. మా సంపాదనలో 75 శాతం సమాజానికి తిరిగిస్తానని అగ్నికి వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను. అయితే, నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా నడవాలో నాకు తెలియడం లేదు. కానీ నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాను' అని అనిల్ అగర్వాల్ తన ఎక్స్ సందేశంలో రాసుకొచ్చారు.
'ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు. నా ప్రియమైన కుమారుడు అగ్నివేశ్ చాలా త్వరగా మనల్ని విడిచిపెట్టాడు. అతనికి కేవలం 49 సంవత్సరాలు.. ఆరోగ్యంగా, జీవితం కలలతో నిండి ఉంది. USలో జరిగిన స్కీయింగ్ ప్రమాదం తర్వాత అతను న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో బాగా కోలుకుంటున్నాడు. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. అకస్మాత్తుగా గుండెపోటు మా కొడుకును మా నుంచి లాక్కుంది. తన బిడ్డకు వీడ్కోలు చెప్పాల్సిన తల్లిదండ్రుల బాధను పదాలు వర్ణించలేవు. కొడుకు తన తండ్రి కంటే ముందే వదిలి వెళ్లకూడదు' అని అనిల్ అగర్వాల్ తన బాధను వ్యక్తం చేశారు.
'అగ్ని జూన్ 3, 1976న పాట్నాలో జన్మించిన రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది. మధ్యతరగతి బిహారీ కుటుంబం నుంచి అతను బలం, కరుణ, సుహృద్భావం కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. తన తల్లి జీవితానికి ఆయన ఒక వెలుగు. రక్షణనిచ్చే సోదరుడు, నమ్మకమైన స్నేహితుడు. అతను కలిసిన ప్రతి ఒక్కరికీ ఆయనొక సున్నితమైన బలం.'
'అగ్నివేశ్ చాలా విషయాల్లో మేటి. క్రీడాకారుడు, సంగీతకారుడు, ఒక నాయకుడు. ఆయన అజ్మీర్‌లోని మాయో కాలేజీలో చదువుకున్నారు. అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన ఫుజీరా గోల్డ్‌ను స్థాపించారు. హిందూస్తాన్ జింక్ ఛైర్మన్ అయ్యారు. సహోద్యోగులు, స్నేహితుల గౌరవాన్ని పొందారు. అయినప్పటికీ, అన్ని బిరుదులు.. విజయాలకు మించి, ఆయన సరళంగా, హృదయపూర్వకంగా, లోతైన మానవత్వంతో ఉన్నారు. నాకు, ఆయన నా కొడుకు మాత్రమే కాదు. ఆయన నా స్నేహితుడు. నా గర్వం. నా ప్రపంచం' అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అనిల్ అగర్వాల్.
అనిల్ అగర్వాల్ ఈ దాతృత్వ ప్రకటన 2014లోనే చేశారు. బిల్ గేట్స్ స్ఫూర్తితో 'గివింగ్ ప్లెడ్జ్'లో చేరి, కుటుంబ సంపదలో 75%ను దానం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా వేదాంతా గ్రూప్ విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో భారీ సహాయం అందిస్తున్నారు.
అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తోపాటు కుమార్తె ప్రియ ఉన్నారు. ఆమె వేదాంతా లిమిటెడ్ బోర్డు మెంబర్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. వేదాంతా అనుబంధ సంస్థ అయిన తల్వండి సోబో పవర్ లిమిటెడ్‌కు అగ్నివేశ్ ఛైర్మన్.
ప్రధాని మోదీ సంతాపం..
అగ్నివేశ్ అకాల మరణంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు మీ కుటుంబానికి ధైర్యమివ్వాలని ప్రార్థిస్తున్నానంటూ అనిల్ అగర్వాల్ ఉంచిన పోస్టుపై మోదీ స్పందించారు.
ఇవి కూడా చదవండి...
ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర: సీఎం రేవంత్
ప్రభుత్వాస్పత్రిలో కత్తులతో సైకో హల్‌చల్.. భయంతో రోగుల పరుగులు
Read Latest Telangana News And Telugu News