రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్.. డీఎంకే మేనిఫెస్టో
ABN , Publish Date - Mar 29 , 2026 | 08:43 PM
సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే మందుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు.
చెన్నై: సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు అన్ని రాష్ట్రాల కంటే మందుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) చెప్పారు. రైతులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. కలైంజ్ఞర్ మహిళా రీతి యోజన పథకం కింద ప్రతినెలా రూ2,000, పుదుమై పెన్, తమిళ పుదల్వాన్ పథకాల కింద ప్రతి విద్యార్థికి నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను 8వ తరగతి వరకూ విస్తరించనున్నట్టు చెప్పారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి ఆదివారంనాడు విడుదల చేశారు.
ఏడోసారి కూడా మేమే..
ద్రవిడ పాలనా నమూనా కింద సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు లీడింగ్ స్టేట్‌గా ఉందని, ప్రజల మద్దతుతో డీఎంకే ఏడోసారి కూడా అధికారంలోకి రానుందని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తమిళనాడులో సంక్షేమ పథకాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని చెప్పారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే రైతులకు మీటర్లు లేకుండా ఉచిత పంప్‌లు ఏర్పాటు చేస్తామని, వృద్ధాప్య పెన్షన్లను రూ.2,000కు, దివ్వాంగుల పెన్షన్‌ను రూ.2,500కు పెంచుతామని చెప్పారు. కలైంజ్ఞర్ కనవు ఇల్లాం పథకం కింద తమిళనాడులో 10 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ధాన్యం సేకరణ ధరను క్వింటాలకు రూ.3,500, చెరకు టన్ను రూ.4,500కు పెంచుతామని, ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.
మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ1,000 నుంచి రూ.2,000కు పెంచుతామని, అర్హత కలిగిన మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ.5 లక్షల వరకూ కొలేటరల్-ఫ్రీ బ్యాంకు లోన్లు సబ్సిడీతో అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు, కవరేజ్‌ను రూ.10 లక్షలకు పెంచుతామని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల రిలీఫ్ అసిస్టెన్స్‌ను రూ.8,000 నుంచి రూ.12,000కు, లీన్ పీరియడ్ అసిస్టెన్స్‌ను రూ.6,000 నుంచి 9,000కు పెంచుతామని, పాడి పరిశ్రమకు సంబంధించి పాలసేకరణ ధరను లీటరుకు రూ.5 చొప్పున పెంచుతామని హామీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ