వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ
ABN , Publish Date - Mar 29 , 2026 | 05:27 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కనీసం మాంసం, గుడ్లు తినే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.
పురూలియా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలు కనీసం మాంసం, గుడ్లు తినే పరిస్థితి కూడా ఉండదని అన్నారు. పురూలియాలో ఆదివారంనాడు జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలపై బీజేపీ దాడులు జరుపుతోందని ఆరోపించారు.
'బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు తినరు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మీరు కూడా మాంసం, గుడ్లు తినలేరు. బీజేపీ ఏకపక్షంగా ఉంటుంది. వేరే మతాన్ని వాళ్లు విశ్వసించరు. అల్లర్లను ప్రోత్సహిస్తారు. అల్లర్లను ప్రేరేపించడం ప్రజలను చంపడం ద్వారా అధికారంలోకి వస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజనులు, మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. మన బెంగాలీ మాట్లాడే ప్రజలపై కూడా ఇతర రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి. కానీ మనం ఎప్పుడూ అణిచివేతకు పాల్పడలేదు' అని మమతా బెనర్జీ అన్నారు.
అన్నిచోట్లా నేనే అభ్యర్థిని
బెంగాల్‌లో సాగిస్తున్న పోరాటాన్ని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకు వెళ్తామని, ప్రజల ఆశీర్వాదంతో బెంగాల్‌లో గెలిచి, రేపు ఢిల్లీలో సైతం గెలుపు సాధిస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీని సాధించేంతవరకు ప్రజలకు ప్రశాంతత ఉండదని, వాళ్లు (బీజేపీ) ఎన్ని దాడులు జరిపినా గెలుపు బెంగాల్‌దేనని అన్నారు. టీఎంసీ అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని, పార్టీ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలబడ్డారనేది చూడవద్దని, అన్ని చోట్లా తానే అభ్యర్థినని మమతా బెనర్జీ అన్నారు. కాగా, 294 మంది సభ్యుల పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి.
గత ఎన్నికల్లో...
2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 213 సీట్లతో ఘనవిజయం సాధించింది. బీజేపీ 77 సీట్లకు పరిమితమైంది. కాంగ్రెస్, వామపక్షాలు ఖాతా తెరువలేదు.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దోపిడీ నుంచి మార్పును కోరుతున్న ప్రజలు: మోదీ
డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం... విజయ్ ఎన్నికల మేనిఫెస్టో