కాంగ్రెస్ 5 గ్యారంటీలు ప్రకటించిన ఖర్గే
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:11 PM
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
గువాహటి: అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) తెలిపారు. మహిళలకు నగదు బదిలీ సహా 5 హామీలను ఆయన ప్రకటించారు. లఖింపూర్ జిల్లా నౌబోయిచాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే పాల్గొన్నారు.
మహిళా సంక్షేమంపై దృష్టిపెడతామని, అందరికీ ఆరోగ్య సంరక్షణ, భూమి హక్కులు కల్పించడం, జుబీన్ గార్గ్ మృతి కేసులో న్యాయం చేయడం వంటివి పార్టీ ప్రధాన హామీలుగా ఖర్గే చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని కుటుంబాలకు రూ.25 లక్షల క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని, 10 లక్షల మంది మూలవాసులకు శాశ్వత భూమి పట్టాలు ఇస్తామని, రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు రూ.1,250 చొప్పున నెలవారీ పెన్షన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జుబీన్ గార్గ్ మృతి కేసులో న్యాయం చేస్తామని చెప్పారు.
'డబుల్' లూటీ
రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ డబుల్ ఇంజిన్‌తో అస్సాంను లూటీ చేసి, తమ నాయకులు, కుటుంబాల ఖజానాలు నింపుతోందన్నారు. హిమంత్ బిశ్వశర్మను నకిలీ సీఎంగా ఆయన పేర్కొన్నారు. శర్బానంద్ సోనోవాల్ నాయకత్వంలో బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిందని, అయితే గిరిజనుడైన సోనోవాల్‌ను తొలగించి సీఎం పదవిని శర్మ చేపట్టారని అన్నారు.
కాగా, అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి అవసరమైన పూర్తి స్థానాలు దక్కనప్పటికీ భాగస్వామ్య పార్టీల మద్దతుతో బీజేపీ అధికారం చేపట్టింది.
ఇవి కూడా చదవండి..
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ