Share News

అలా అయితేనే డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు.. డీఎంకే డిమాండ్

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:00 PM

డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి డీఎంకే రెండు షరతులను విధించినట్టు తెలుస్తోంది. వాటికి అంగీకరిస్తేనే.. పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసినట్టు సమాచారం.

అలా అయితేనే డీలిమిటేషన్‌ బిల్లుకు మద్దతు.. డీఎంకే డిమాండ్
Lok Sabha (File Photo)

ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్‌తో కూడిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఉభయ సభల్లో తన సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లుకు మద్దతు ఇవ్వడానికి తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే రెండు షరతులను విధించినట్టు తెలుస్తోంది. వాటికి అంగీకరిస్తేనే.. పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేస్తామని ఆ పార్టీ స్పష్టం చేసినట్టు సమాచారం. పునర్విభజనలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేరీతిన లోక్‌సభ సభ్యుల సంఖ్యను 50 శాతానికి పెంచాలని, పార్లమెంట్‌లో తమిళనాడుకు ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం డీలిమిటేషన్ తరువాత కూడా ఉండాలని డీఎంకే డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్న లోక్‌సభ ప్రాతినిధ్య నిష్పత్తి మరో 25 ఏళ్లు యథాతథంగా కొనసాగించాలని ఆ పార్టీ తేల్చిచెప్పిందని మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే తమ డిమాండ్లను నెరవేరుస్తామని కేంద్రం నోటిమాటతో హామీ ఇస్తే సరిపోదని, ఈ అంశాలను బిల్లులో చేర్చాలని డీఎంకే పట్టుబట్టినట్టు వినికిడి.


ఈ నేపథ్యంలో డిమాండ్ల విషయంలో తమ పార్టీ వెనక్కు తగ్గదని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు (శుక్రవారం) తెలిపారు. లోక్‌సభలో తమ రాష్ట్ర ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పార్లమెంట్‌ సభ్యుల సంఖ్య పెరిగినా, తమిళనాడు వాటా మాత్రం తగ్గకూడదని వివరించారు. కాగా ప్రస్తుతం ఆ రాష్ట్రంలో మొత్తం 39 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒకవేళ కేంద్రం 50 శాతం పెంపునకు అంగీకరిస్తే.. అక్కడ సీట్ల సంఖ్య 59కు చేరుకుంటుంది.

మరోవైపు డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గతంలో ఆ బిల్లును ప్రవేశపెట్టగా.. అది వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ బిల్లులో పలు మార్పులు తీసుకొచ్చింది. పునర్విభజన తర్వాత ఏ రాష్ట్రమూ తన లోక్‌సభ సీట్ల నిష్పత్తి కోల్పోకుండా బిల్లును కేంద్రం సవరించినట్టు తెలుస్తోంది.


ఈ వార్తలూ చదవండి

డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

డీలిమిటేషన్ ఆమోదానికి మ్యాజిక్ ఫిగర్ 360.. మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం

Updated Date - Nov 27 , 2026 | 05:09 PM