Share News

ఢిల్లీలో మళ్లీ హింసాత్మక ఘర్షణలు.. పోలీసులపై రాళ్లురువ్విన నిరసనకారులు

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:32 AM

దేశ రాజధాని ఢిల్లీ బుధవారం అర్ధరాత్రి వేళ నిరసనలతో దద్దరిల్లింది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు, ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు.

ఢిల్లీలో మళ్లీ హింసాత్మక ఘర్షణలు.. పోలీసులపై రాళ్లురువ్విన నిరసనకారులు
Delhi Violence

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు, పోలీసుల మధ్య మరోసారి బాహాబాహీ జరిగింది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ నిర్వహించడం సహా భాష్పవాయువునూ ప్రయోగించారు.


ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్ల(ACP)తో పాటు కనీసం ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. గాయపడిన ఏసీపీలు వివేక్‌ భగత్‌, జయప్రకాశ్‌లను చికిత్స నిమిత్తం స్థానిక రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం, కొందరు నిరసనకారులు పార్లమెంట్‌ స్ట్రీట్‌ వైపు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి, మానవహారంగా నిల్చుని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా చెలరేగి ప్లాస్టిక్‌ బాటిళ్లు, రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక రాయి ఓ పోలీస్ అధికారికి తగలడంతో ఆయన తలకు గాయమైందని తెలిపారు.


ఈ ఘర్షణ సంబంధిత వీడియోలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. అందులో కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఒక భద్రతా సిబ్బందిపై గుంపుగా దాడి చేసిన దృశ్యాలూ కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు నిరసనకారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని, హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జంతర్‌మంతర్‌ పరిసరాల్లో ఇంటర్నెట్‌ జ్యామర్లను ఏర్పాటుచేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.


ఇవీ చదవండి:

ఢిల్లీలో టెన్షన్ వాతావరణం.. 16 మెట్రో స్టేషన్ల మూసివేత

'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ విమర్శలు

Updated Date - Jul 23 , 2026 | 12:03 PM