పేపర్ లీక్ దోషులను శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Jul 23 , 2026 | 09:35 AM
పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఉపేక్షించబోమని ప్రధాని మోదీ చెప్పారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
ఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న NEET పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల అక్రమాలకు పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారికి త్వరితగతిన, అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చూడటానికి 'ఫాస్ట్ ట్రాక్ కోర్టులను' ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ అంశంపై ఇవాళ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. 'మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే.. ఏదీ ముఖ్యం కాదు! పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్నవారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు మేము తీసుకుంటున్న వరుస చర్యల్లో ఇది భాగం. యువత భవిష్యత్తును దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టేది లేదు' అని ప్రధాని చెప్పారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలను తీవ్రతరం చేశాయి. 'చలో సంసద్' పిలుపుతో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. తమ ఆందోళనను విరమించాలంటే ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు ఆర్గనైజేషన్ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: విద్యాశాఖ మంత్రి రాజీనామా విషయంలో రాజీపడేదే లేదని, ఈ డిమాండ్ నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
2. రూ. 1 కోటి పరిహారం: పేపర్ లీక్ వ్యవహారం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలి.
3. కేసుల ఉపసంహరణ: ప్రశాంతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై పెట్టిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి కేసులు పెట్టబోమని ప్రభుత్వం నుంచి హామీ కావాలని డిమాండ్ చేశారు.
అటు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ... పేపర్ లీకేజీల అంశాన్ని రాజకీయం చేయకూడదని, ఇది చాలా తీవ్రమైన సమస్య కాబట్టి లోతైన చర్చ అవసరమని పేర్కొన్నారు.
శాంతియుత నిరసనలకు పిలుపు – పోలీసులతో ఘర్షణ
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో మాట్లాడినట్లు సౌరవ్ దాస్ తెలిపారు. నిరసనల వంకతో కొన్ని అసాంఘిక శక్తులు చొరబడి ఆందోళనలను దారి మళ్లించే ప్రమాదం ఉందని, కాబట్టి విద్యార్థులంతా శాంతియుతంగానే నిరసనలు తెలపాలని వాంగ్‌చుక్ విజ్ఞప్తి చేశారు.
ఉద్రిక్త వాతావరణం:
ఇలా ఉండగా, ఢిల్లీలో జరిగిన నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులతో పాటు పలువురు మహిళా పోలీసులు, మొత్తంగా 118 మందికి పైగా పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాగే ఈ తోపులాటలో దాదాపు 60 మంది నిరసనకారులు కూడా గాయపడినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్లకు టోకరా
రాష్ట్రంలో మరో 4 కొవిడ్ కేసులు