Digital Arrest: 17 రోజులపాటు డిజిటల్ అరెస్టు.. రూ.15 కోట్లు స్వాహా..
ABN , Publish Date - Jan 11 , 2026 | 07:01 PM
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కావడమే కాదు.. ఏకంగా రూ.15 కోట్ల వరకు మోసపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో నివసిస్తున్న ఒక వృద్ధ ఎన్ఆర్ఐ (NRI) దంపతులకి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. ఏకంగా 17 రోజుల పాటు ‘డిజిటల్ అరెస్ట్’ చేసి వారి నుంచి రూ.15 కోట్లు స్వాహా చేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాధితులు డాక్టర్ ఓం తనేజా ఆయన భార్య ఇందిరా తనేజా. ఈ జంట సుమారు 48 ఏళ్ల పాటు అమెరికాలో ఐక్యరాజ్య సమితి(UN)లో జాబ్ చేసి, 2015లో రిటైర్మెంట్ అయి భారత్‌కి వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 24న ఇందిరాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము సీబీఐ(CBI), ఈడీ(ED), ఆర్‌బీఐ(RBI) అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు.
మీరు పలు అక్రమాలతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తమ వద్ద సమాచారం ఉందని బెదిరించారు. తాము చెప్పినట్లు చేయకుంటే శిక్ష తప్పదని వీడియో కాల్స్ ద్వారా హెచ్చరించారు. సైబర్ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా ఈ జంటను నిరంతరం నిఘాలో ఉంచారు. దీనినే ‘డిజిటల్ అరెస్ట్’ అని పిలుస్తారు. ఫోన్, వీడియో కాల్స్‌లో సైబర్ నేరగాళ్లు చేసిన హడావుడి చూసి భార్యాభర్తలు భయపడిపోయారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17 రోజులపాటు ఈ జంటను డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈ మధ్యలో 8 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని బలవంతం చేశారు. ఒకసారి రూ.2కోట్లు తర్వాత మరో రూ.2.10కోట్లకు పైగా అలా విడతల వారీగా మొత్తంగా రూ.14.85 కోట్ల తమ అకౌంట్‌లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.
వాస్తవానికి ఒకేసారి అంత పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ ఫర్ అనగానే బ్యాంక్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ, సైబర్ నేరగాళ్లు వారిని బెదిరించి తమకు అనుకూలంగా మాట్లాడించారు. జనవరి 10న సైబర్ నేరగాళ్లు ఆ దంపతులతో ‘మీ డబ్బులు ఆర్బీఐ రీఫండ్ చేస్తుంది’ అని చెప్పారు. వెంటనే ఈ జంట లోకల్ పోలీసులను సంప్రదించగా తాము ఘోరంగా మోసపోయామని గ్రహించారు. ట్విస్ట్ ఏంటంటే.. స్టేషన్‌కి వెళ్లిన ఆ జంటకు వీడియో కాల్ రాగా.. దాన్ని పోలీసులు రిసీవ్ చేసుకున్నారు. నేరగాళ్లు పోలీసులను కూడా దారుణంగా తిట్టినట్లు సమాచారం. ఎన్ఆర్ఐ జంట ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు పోలీసులు. అంత పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోవడంతో ఎన్ఆర్ఐ జంట తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇవీ చదవండి:
మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం
అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో..