Fake IAS officer: అంతా పక్కాగా మేనేజ్ చేసిన నకిలీ ఐఏఎస్! ఒకే ఒక మిస్టేక్‌తో..
ABN , Publish Date - Jan 04 , 2026 | 08:36 PM
ఐఏఎస్ ఆఫీసర్‌నని చెప్పుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని ఝార్‌ఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సివిల్స్‌లో విఫలమైన అతడు చివరకు ఇలా నకిలీ ఐఏఎస్‌లా మారి ఏడేళ్లుగా జనాలను బురిడీ కొట్టిస్తున్నట్టు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐఏఎస్ ఆఫీసర్‌నంటూ స్టేషన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ వ్యక్తి పోలీసులనే తొలుత బురిడీ కొట్టించాడు. కానీ చిన్న మిస్టేక్‌తో తన బండారం తనే బయటపెట్టుకున్నాడు. ఝార్ఖండ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది (Fake IAS Officer Arrest in Jharkhand).
పలామూ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజేశ్ (35) అనే ఓ వ్యక్తి జనవరి 2న హుసైనాబాద్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారు. తనని తాను ఐఏఎస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. తను ఒడిశా కేడర్ ఆఫీసర్‌నని చెప్పుకున్నాడు. కుకీ గ్రామస్థుడినని, వ్యక్తిగత పనిమీద వచ్చానని చెప్పాడు. హుసైనాబాద్ ప్రాంతంలోని తన బంధువు ఒకరు భూవివాదంలో ఇరుక్కున్నారని, రేపు స్టేషన్‌కు అతడు వస్తాడని తెలిపారు. ఈ విషయంలో సాయం చేయాలని కోరారు. తొలుత రాజేశ్ చెప్పిన వివరాలను నమ్మని పోలీసు అధికారి సోనూ కుమార్ చౌదరి ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకున్నారు. అయితే, ఒడిశా కేడర్ ఆఫీసర్‌నని చెప్పుకున్న రాజేశ్ ఆ తరువాత తాను డెహ్రాడూన్, హైదరాబాద్, భువనేశ్వర్ జిల్లాలో కూడా చేశానని చెప్పడంతో పోలీసు అధికారికి డౌట్ వచ్చింది. రాజేశ్‌ను ఆయన మరిన్ని ప్రశ్నలు అడిగేసరికి అతడు మాట మార్చాడు.
తాను ఐపీటీఏఎఫ్‌ఎస్ ఆఫీసర్‌నని, అది ఐఏఎస్ స్థాయి సర్వీస్ అని అన్నాడు. అయితే, ప్రభుత్వ అధికారి ఎవ్వరూ తన సర్వీసును తప్పుగా చెప్పరు. దీంతో, పోలీసు ఆఫీసర్ డౌట్ మరింత పెరిగి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్‌డీపీఓ స్థాయిలో ఎంక్వైరీ జరిపించగా రాజేశ్ ప్రభుత్వ అధికారి కాదన్న విషయం నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని వెతికి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతడి హ్యుండాయ్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించగా బండారం మొత్తం బయటపడింది. నిందితుడు తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు.
తాను ఐఏఎస్ కావాలని తన తండ్రి కోరుకునే వాడని, కానీ తాను నాలుగు సార్లు పరీక్ష రాసినా నెగ్గలేకపోయానని తెలిపాడు. ఒకసారి మాత్రం ప్రిలిమ్స్‌లో గట్టెక్కానని అన్నాడు. ఇక అతడి కారులోని పలు ప్రభుత్వ సంస్థల ఫేక్ ఐడీ కార్డులు, కారుపై గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా అని రాసున్న ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లుగా అతడు ఆ పరిసరాల్లో ఐఏఎస్ అధికారినని చెప్పుకుని తిరుగుతున్నట్టు గుర్తించారు. ప్రభుత్వాఫీసులు, పోలీస్ స్టేషన్‌లల్లో తన పరపతిని చెలాయించుకునే ప్రయత్నం చేశాడని అన్నారు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
వాహనంలో అర్ధరాత్రి వేళ మహిళపై అఘాయిత్యం.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
వెబ్‌సైట్ ఒరిజినలా? లేక ఫేకా? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే..