ఢిల్లీలో హై అలర్ట్.. 11 మెట్రో స్టేషన్లు మూసివేత
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:05 PM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ)తోపాటు సామాజిక వేత్తలు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు.
ఢిల్లీ, అక్టోబర్ 02: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇండియా కూటమిలోని పార్టీలు, కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ)తోపాటు సామాజిక వేత్తలు శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రంతోపాటు పోలీసులు బలగాలు అప్రమత్తమయ్యాయి. జంతర్ మంతర్ నుంచి సెంట్రల్ ఢిల్లీకి వచ్చే మార్గంలోని 11 ప్రధాన మెట్రో స్టేషన్లను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తాత్కాలికంగా మూసివేసింది. అలాగే సెంట్రల్ ఢిల్లీలోని మొబైల్, ఇంటర్నెట్ సేవలను కూడా పూర్తిగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో యాప్ బుకింగ్ సేవలు.. ఉబర్, ఓలా, భారత్ ట్యాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరో వైపు న్యూఢిల్లీ జిల్లాలో 163 సెక్షన్ కింద ఆంక్షలు అమల్లో ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న ఢిల్లీ మాజీ సీఎం అతిశితోపాటు పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారంతా తోసుకుని ముందుకెళ్లారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరో వైపు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ముంబైలోని శివాజీ పార్క్ వద్ద ఈ రోజు నిరసన చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఆయన ఆ పదవి నుంచి వైదొలగకపోతే.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపింది. అక్టోబర్ నెలాఖరు నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని.. ఆయన క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి ఉందని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే వెల్లడించారు.
ఈ పోరాటంలో తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని దీప్కే స్పష్టం చేశారు. ఇక సీజేపీ ఏ రాజకీయా పార్టీలో భాగం కాదని.. ఇది స్వతంత్ర ఉద్యమంగా కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు. అయితే ఇండియా కూటమిలోని పార్టీలు చేస్తున్న పోరాటాన్ని ఈ సందర్భంగా దీప్కే అభినందించారు. ఇంకో వైపు అక్టోబర్ 6వ తేదీన ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఆందోళనలు చేపట్టనున్న విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. రేపే సుప్రీంకోర్టులో పిటిషన్
రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా పీఎం రాహత్