ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరైన అగ్రనేతలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 04:27 PM
ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం బుధవారం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులు.. కేసీ వేణుగోపాల్, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, అంబికా సోనీ, జైరామ్ రమేశ్, సచిన్ పైలట్, దామోదర రాజనర్సింహ, దిగ్విజయ సింగ్, ఎన్.రఘువీర రెడ్డి, పల్లంరాజుతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నీట్ పేపర్ లీక్‌తోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాంపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది.
అలాగే అయోధ్య రామమందిర విరాళాల ‘చోరీ’ ఆరోపణలపై పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణకు రూపకల్పన జరగనుందని సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా అనుసరించాల్సిన వ్యూహాంపై సమీక్షించనున్నారు. ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు హాజరయ్యారు.
నీట్ పేపర్ లీక్ అంశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనకు విద్యార్థులతో ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో జులై 20వ తేదీన న్యూఢిల్లీలో ఛలో పార్లమెంట్ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
అలాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో యాంటీ పేపర్ లీక్ బిల్లుతోపాటు పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర పడింది. అయితే ఛలో పార్లమెంట్ ర్యాలీలో విద్యార్థులపై భద్రతా దళాలు జరిపిన లాఠీ ఛార్జ్‌కు ఆదేశాలు ఎవరు ఇచ్చారో పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కేంద్రాన్ని ప్రధాన విపక్షం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు ఆగస్టు 13వ తేదీన ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి.
అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీకాక ఈ ఏడాది జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్‌ను ఎన్నికల సంఘం చేపట్టింది. దీని ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన వ్యూహాల కోసం చేపట్టాల్సిన విధి విధానాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారనే చర్చ సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు: నారాయణ
‘టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా’.. సుష్మితా పటేల్ సంచలన ప్రకటన
For More National News And Telugu News