Share News

ప్రపంచ శాంతికి సాంస్కృతిక అనుసంధానమే బలమైన గ్యారంటీ.. ప్రధాని మోదీ

ABN , Publish Date - Nov 20 , 2026 | 08:52 PM

ప్రపంచ దేశాల మధ్య శాంతికి సాంస్కృతిక అనుసంధానమే బలమైన గ్యారంటీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో తొలి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నాగరికతల సంభాషణ వేదికను ఆయన ప్రారంభించి మాట్లాడారు

ప్రపంచ శాంతికి సాంస్కృతిక అనుసంధానమే బలమైన గ్యారంటీ.. ప్రధాని మోదీ

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాల మధ్య శాంతికి సాంస్కృతిక అనుసంధానమే బలమైన గ్యారంటీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో తొలి షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నాగరికతల సంభాషణ వేదికను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వివిధ దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడులు సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ప్రపంచాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎస్‌సీఓ దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు మోదీ పలు ప్రతిపాదనలు చేశారు.


ప్రాచీన గ్రంథాలను డిజిటలైజేషన్‌ చేయాలి

ఎస్‌సీఓ దేశాల సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ప్రధాని మోదీ సూచించారు. అనేక గొప్ప సాహిత్య రచనలు పరిమిత భాషల్లోనే అందుబాటులో ఉన్నాయని, వాటిని ఇతర భాషల్లోకి అనువదించేందుకు ఏఐ సాంకేతికత దోహదపడుతుందన్నారు. ప్రస్తుత కాలంలో గతంలో ఎన్నడూ లేనన్ని సాంకేతిక వనరులు అందుబాటులో ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, సభ్య దేశాల్లోని మ్యూజియంలు, గ్రంథాలయాలు, ఆర్కైవ్‌లలో వేల ఏళ్ల చరిత్రకు సంబంధించిన విలువైన సంపద ఉందని మోదీ గుర్తుచేశారు. ప్రాచీన మ్యానుస్క్రిప్ట్‌లు, అరుదైన గ్రంథాలు, చారిత్రక పత్రాలు, కళాఖండాలు ఆయా నాగరికతల మధ్య ఉన్న సంబంధాలను తెలియజేస్తాయని చెప్పారు. వాటిని డిజిటలైజ్‌ చేయడంతో పాటు పరస్పరం అనువదించుకునేందుకు సభ్య దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు.


సిల్క్‌ రూట్స్‌, బౌద్ధ క్షేత్రాలతో పర్యాటకాభివృద్ధి

సాంస్కృతిక పర్యాటక రంగంలోనూ ఎస్‌సీఓ దేశాల మధ్య సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని మోదీ పేర్కొన్నారు. సభ్య దేశాల్లో సిల్క్‌ రూట్స్‌, ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి సంబంధించిన అనేక చారిత్రక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ అనుసంధానిస్తూ హెరిటేజ్‌ సర్క్యూట్లు, సాంస్కృతిక పర్యాటక మార్గాలను అభివృద్ధి చేయాలని ఆయన ప్రతిపాదించారు. తద్వారా ఆయా దేశాల మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రజలు మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 20 , 2026 | 08:52 PM