Share News

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించాం.. కాంగ్రెస్ అధిష్టానం

ABN , Publish Date - May 26 , 2026 | 07:00 PM

కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని, త్వరలో జరుగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించాం.. కాంగ్రెస్ అధిష్టానం
DK Shivakumar and Siddaramaiah

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ అధిష్టానం మంగళవారంనాడు జరిపిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదన్నారు. త్వరలో జరుగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే సమావేశంలో చర్చ జరిగినట్టు చెప్పారు.


'కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ సమావేశంలో కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశాలే చర్చించాం. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాం' అని చెప్పారు. చర్చలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక ఇన్‌చార్జి, తాను పాల్గొన్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రాజ్యసభ సీట్ల ఎన్నికలను ప్రకటించారని, దానిపైనే ఈరోజు చర్చించామని, తక్కినవన్నీ ఊహాగానాలేనని వివరించారు.


కాంగ్రెస్ 2023లో కర్ణాటకలో అధికారం చేపట్టినప్పటి నుంచి శివకుమార్‌కు పదోన్నతిపై పలుమార్లు ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అధికారం పంపకాలపై ముఖ్యమంత్రి ఎన్నికకు ముందే ఒక అవగాహన ఉందని నేతలు చెబుతున్నారు. అయితే సిద్ధరామయ్య ఆ వాదనలను తోసిపుచ్చారు. ఐదేళ్లూ తాను అధికారంలో ఉంటానని, అయితే పార్టీ నిర్ణయానికి తాను, శివకుమార్ కట్టుబడి ఉంటామని పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లను ఢిల్లీకి రమ్మని పార్టీ అగ్రనాయకత్వం పిలవడంతో నాయకత్వ మార్పిడి అంశం మరోసారి ప్రచారంలోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

వెళ్లగొట్టక ముందే పారిపోండి.. బంగ్లా చొరబాటుదారులకు సువేందు వార్నింగ్

అన్నాడీఎంకేలో ఆగని తిరుగుబాటు.. మరో ఎమ్మెల్యే రాజీనామా

Updated Date - May 26 , 2026 | 08:51 PM