స్కూళ్లు, ఆలయాల సమీపంలో మద్యం దుకాణలపై నిషేధం.. సువేందు అధికారి
ABN , Publish Date - May 26 , 2026 | 04:30 PM
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంగళవారంనాడు పలు సంక్షేమ, నియంత్రణ చర్యలను ప్రకటించారు. విద్యాసంస్థలు, ఆలయాలకు ఒక కిలోమీటర్ దూరంలోపు మద్యం దుకాణాలపై నిషేధం విధించారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) మంగళవారంనాడు పలు సంక్షేమ, నియంత్రణ చర్యలను ప్రకటించారు. విద్యాసంస్థలు, ఆలయాలకు ఒక కిలోమీటర్ దూరంలోపు మద్యం దుకాణాలపై నిషేధం విధించారు. మహిళలకు ప్రతినెలా ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీపై చేపలతో కూడిన భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సువేందు అధికారి వివరిస్తూ, స్కూళ్లు, కాలేజీలు, ఆలయాలకు కిలోమీటరు దూరంలోపు మద్యం దుకాణాలను అనుమతించమని చెప్పారు. అన్నపూర్ణ యోజన కింద అర్హులైన మహిళలకు రూ.3,000 ఆర్థికసాయం అందించనున్నామని, మే 27 నుంచి అప్లికేషన్లను సెక్రటేరియట్ నుంచి జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.
రూ.5కే చేపల కూరతో భోజనం
రాష్ట్రవ్యాప్తంగా సబ్సిడీతో క్యాంటిన్లు ఏర్పాటు చేయనున్నామని, రూ.5కే చేపలతో కూడిన భోజనం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇందుకోసం 400 క్యాంటిన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య శాఖ నుంచి వేరుచేస్తూ ప్రత్యేక ఆయుష్ శాఖను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కాగా, నదియా, నార్త్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ముఖ్యమంత్రి మంగళవారంనాడు అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు.
ఇవి కూడా చదవండి..
అన్నాడీఎంకేలో ఆగని తిరుగుబాటు.. మరో ఎమ్మెల్యే రాజీనామా
నాయకత్వ మార్పుపై అధిష్ఠానం సమన్లు.. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్