నాయకత్వ మార్పుపై అధిష్ఠానం సమన్లు.. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్
ABN , Publish Date - May 26 , 2026 | 01:48 PM
కర్ణాటకలో నాయకత్వ మార్పు అవకాశాలపై ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం నాయకత్వ మార్పుపై ఇంతవరకూ పెదవి విప్పనప్పటికీ దీనిపై చర్చించేందుకు సీనియర్ నేతలిద్దరినీ ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచింది.
న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పు అవకాశాలపై ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ (DK Shivakumar) ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం నాయకత్వ మార్పుపై ఇంతవరకూ పెదవి విప్పనప్పటికీ దీనిపై చర్చించేందుకు సీనియర్ నేతలిద్దరినీ ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచింది. ఈ అంశాన్ని పరిష్కరించి, పార్టీలో ఇరు వర్గాల మధ్య అంతర్గాత పోరుకు తెరదించాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
అధిష్ఠానం పిలుపు మేరకు ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయానికి నేతలిద్దరూ మంగళవారంనాడు చేరుకున్నారు. అయితే కార్యాలయం వెలుపల మీడియా మందు చర్చల అంశంపై నాయకులిరువురూ పెదవి విప్పలేదు. నాయకత్వ మార్పు అవకాశాలపై సిద్ధరామయ్యను అడిగినప్పుడు 'ఆ మాట ఎప్పుడూ వినిపిస్తూనే ఉంది కదా' అంటూ సమాధానం దాటవేశారు. కొద్దికాలంలో కర్ణాటక రాజకీయాల్లో తలెత్తిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఇందిరా భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితులుగా పేరున్న సతీష్ జార్కిహోలి, జి.పరమేశ్వర, హెచ్‌సీ మహదేవప్ప సహా పలువురు మంత్రులు హస్తినకు చేరుకోవడంతో నాయకత్వ మార్పు అంశం మరోసారి ఊపందుకుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మే 20వ తేదీతో మూడేళ్ల పాలన పూర్తి చేసుకోవడంతో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ నాయకత్వం ఢిల్లీకి తనను ఆహ్వానించిందని, అయితే ఎజెండా తెలియదని సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ సోమవారంనాడు ధ్రువీకరించారు. 'మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు సమావేశం ఉంది. సబ్జెక్ట్ ఏమిటనేది తెలియదు. కేసీ వేణుగోపాల్ ఫోను చేసి తేదీ, సమయం చెప్పారు' అని వెల్లడించారు. తనను పిలిస్తే ఢిల్లీ వెళ్తానని తొలుత చెప్పిన డీకే శివకుమార్ సైతం ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తున్నట్టు ధ్రువీకరించారు. నాయకత్వ మార్పుపై అడిగినప్పుడు 'దాని గురించి తెలియదు, దానిపై వ్యాఖ్యానించ లేను. అది నాపని కాదు' అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ 2023లో కర్ణాటకలో అధికారం చేపట్టినప్పటి నుంచి శివకుమార్‌కు పదోన్నతిపై పలుమార్లు ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అధికారం పంపకాలపై ముఖ్యమంత్రి ఎన్నికకు ముందే ఒక అవగాహన ఉందని నేతలు చెబుతున్నారు. అయితే సిద్ధరామయ్య ఆ వాదనలను తోసిపుచ్చారు. ఐదేళ్లూ తాను అధికారంలో ఉంటానని, అయితే పార్టీ నిర్ణయానికి తాను, శివకుమార్ కట్టుబడి ఉంటామని పలుమార్లు చెప్పారు. కాగా, కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నందున దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం తాజా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగు సీట్లలో మూడు సీట్లను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..
త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు చెప్పిన భర్త..