Share News

దేవెగౌడకు అవమానం.. రాజ్యసభకు బీజేపీ టిక్కెట్ నిరాకరణపై కాంగ్రెస్ ధ్వజం

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:46 PM

జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ పార్లమెంటరీ ఇన్నింగ్స్ ముగిసింది. కర్ణాటకలో పొత్తులో భాగంగా మరోసారి రాజ్యసభ టిక్కెట్‌‌ను దేవెగౌడకు ఇవ్వాలని జేడీఎస్ ఆశించింది. అయితే బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రొఫెసర్ ఎం.నాగరాజును ప్రకటించింది.

దేవెగౌడకు అవమానం.. రాజ్యసభకు బీజేపీ టిక్కెట్ నిరాకరణపై కాంగ్రెస్ ధ్వజం
Deve Gowda

బెంగళూరు: జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) పార్లమెంటరీ ఇన్నింగ్స్ ముగిసింది. కర్ణాటకలో పొత్తులో భాగంగా మరోసారి రాజ్యసభ టిక్కెట్‌‌ను దేవెగౌడకు ఇవ్వాలని జేడీఎస్ ఆశించింది. అయితే బీజేపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ప్రొఫెసర్ ఎం.నాగరాజును ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. జేడీఎస్, దేవెగౌడ మద్దతు వాడుకుని చివరకు రాజ్యసభ సీటు నిరాకరించారని, ఇది జేడీఎస్‌కు మాత్రమే కాకుండా కర్ణాటక ప్రజలకు జరిగిన అవమానమని ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు.


'ఆదివారం అర్ధరాత్రి బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు రాజ్యసభ నామినేషన్‌ను నిరాకరించింది. ఆయనకు బదులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డిస్ట్రిక్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఇన్‌చార్జి ఎం.నాగరాజును తమ అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించింది' అని సూర్జేవాలా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. భాగస్వామ్య పార్టీల మద్దతు వాడుకుని ఆ తర్వాత వదిలివేయడం బీజేపీకి అలవాటేనని, ఇప్పుడు జేడీఎస్‌ను మరోసారి అవమానించిందని అన్నారు. కేవలం మంత్రి పదవి కోసం హెచ్‌డీ కుమారస్వామి ఈ అవమానాన్ని భరించడం విస్మయం కలిగిస్తుందని, ఇప్పటికైనా కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. పార్లమెంటులో అనేక బిల్లులు ఆమోదం పొందేందుకు జేడీఎస్, దేవెగౌడ మద్దతును బీజేపీ తీసుకుందని గుర్తు చేశారు. అయితే ఈ విధమైన వంచనకు ఆ పార్టీ పాల్పడుతుందని ఎవరూ ఊహించి ఉండరని, ఇది కర్ణాటక ప్రజలను కూడా అవమానించడమేనని అన్నారు. ఇందుకు బీజేపీ, ఎన్డీయేలను ప్రజలు భవిష్యత్తులో శిక్షించక మానరని చెప్పారు.


కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈనెల 18న ఎన్నికలు జరగాల్సిండగా, అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా 3 సీట్లను కాంగ్రెస్, ఒక సీటు బీజేపీకి సునాయాసంగా గెలుచుకోగలవు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులుగా మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, పార్టీ మీడీయా, పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేడాను ప్రకటించింది. 224 మంది సభ్యుల కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 135 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, బీజేపీకి 62, జేడీఎస్‌కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ

Updated Date - Jun 08 , 2026 | 07:03 PM