Share News

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:04 PM

టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.

టీఎంసీలో ముదిరిన సంక్షోభం.. స్పీకర్ ఓంబిర్లాకు 20 మంది లోక్‌సభ ఎంపీల లేఖ
TMC crisis

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) తలెత్తిన అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమైంది. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో 61 మంది ఎమ్మెల్యేలు పార్టీ రెబల్ నేత రితబ్రతకు మద్దతు ఇవ్వడంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనను స్పీకర్ నియమించారు. తాజాగా టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు (Om Birla) లేఖ రాసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.


ప్రత్యేక గ్రూపు యోచనలో...

ఓం బిర్లాకు లేఖ రాసిన ఎంపీలు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే అవకాశం ఉందని, దీనిపై రెబల్ ఎంపీలు మంతనాలు జరిపారని తెలుస్తోంది. అయితే ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు తగినంత సంఖ్యాబలం అవసరమవుతుంది. లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నందున ప్రత్యేక గ్రూపుగా ఏర్పడేందుకు కనీసం 20 మందికి పైగా ఎంపీలు అవసరమవుతుంది. తగిన సంఖ్యాబలంతో స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసినందున త్వరలోనే రెబల్ ఎంపీలు లోక్‌సభలో ప్రత్యేక టీఎంసీ బ్లాక్‌గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ఎన్డీయేకు మద్దతుగా...

కాగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు తనతో సహా సుమారు 20 మంది టీఎంసీ ఎంపీలు మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ లోక్‌సభ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ సమర్పించామని చెప్పారు. 'బెంగాల్ తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఎన్డీయేతో కలిసే మా భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఉంటుంది' అని ఆమె తెలిపారు. దీనికి ముందు 13 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు తొలుత సుఖేందు శేఖర్ రాయ్‌తో ఢిల్లీలో సమావేశమయ్యాయి. అనంతరం వీరంతా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలుసుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు

దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు.. హర్దీప్ సింగ్ పురీ

Updated Date - Jun 08 , 2026 | 05:37 PM