Share News

దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు.. హర్దీప్ సింగ్ పురీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 04:15 PM

హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని, 30 నుంచి 60 రోజుల వరకూ సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.

దేశంలో 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు.. హర్దీప్ సింగ్ పురీ
Hardeep Singh Puri

న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధి మూసి ఉంచినప్పటికీ దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని, 30 నుంచి 60 రోజుల వరకూ సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ (Hardeep Singh Puri) తెలిపారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.


సోమవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ... 'మరో 30 రోజులు హోర్ముజ్ జలసంధి మూతపడే ఉంటే ఏం జరుగుతుంది? దేశీయంగా మనకు తగినన్ని నిల్వలు ఉన్నాయి. 60-60-60 అని చెప్పగలను. అంటే 60 రోజులకు సరిపడా క్రూడాయిల్, నేచురల్ గ్యాస్, ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయి' అని హర్దీప్ సింగ్ పురీ చెప్పారు. స్వల్పకాలిక అంతరాయాలను భాగస్వామ్య దేశాల సపోర్ట్‌తో అధిగమించేందుకు అవసరమైన వ్యూహాత్మక ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.


పశ్చిమాసియాలో పరిస్థితి రెండు, మూడు రకాలుగా ఉండొచ్చని, ఘర్షణలు విస్తరిస్తే అది అసాధారణ పరిస్థితి అవుతుందని, అది బాధాకరమని అన్నారు. ఒకవేళ హోర్ముజ్ జలసంధిని మూసి ఉంచిన పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పారు. యూఏఈ వంటి మంచి మిత్రులు మనకున్నారని, ఎల్పీజీ కార్గోలను నేరుగా మనకు పంపగలమని యూఏఈ నుంచి ప్రతిపాదన ఉందని, పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దేశీయంగా స్ట్రాటజిక్ పెట్రోలియం సహా 30 నుంచి 60 రోజులకు సరిపడా అన్నిరకాల నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇవి 76 నుంచి 80 రోజులకు కూడా సరిపోవచ్చన్నారు.


ఇవి కూడా చదవండి..

రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..

Updated Date - Jun 08 , 2026 | 05:17 PM