Share News

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..

ABN , Publish Date - Jun 08 , 2026 | 02:51 PM

ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో భారతదేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో రాజ్యాంగంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..
AICC Chief Mallikarjun Kharge

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో భారతదేశం సమస్యల్లో పడిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(AICC) చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మోదీ హయాంలో రాజ్యాంగంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని.. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా బ్లాక్ కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు. మోదీ ప్రభుత్వంలో దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధాన సవాళ్లపై చర్చించారు.


ఈ సందర్భంగా కూటమి పార్టీలను ఉద్దేశించి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులు దేశానికి రావడం లేదని పేర్కొన్నారు. పలు రంగాల్లో ప్రైవేట్ గుత్తాధిపత్యాలు పెరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)తో లక్షలాది మంది ప్రజలు ఓటు హక్కును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎమ్ఈ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందన్నారు. మోదీ ప్రభుత్వంలో పరీక్షల నిర్వహణ వైఫల్యాలతో యువత నష్టపోతున్నారని ఖర్గే చెప్పుకొచ్చారు.


మూడేళ్ల క్రితం ఇండియా కూటమి ఏర్పడిందని, పార్లమెంటులో ఇటీవల దాని బలం ఏంటో అధికార పక్షం రుచి చూసిందన్నారు. లోక్‌సభలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును ఓడించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 17న కూటమి పార్టీలు దృఢంగా ఏకమయ్యాయని ఖర్గే ప్రశంసించారు. ఇప్పుడు ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిపక్షం ఐక్యంగా ఉండాలన్నారు.


ఈ కీలక సమావేశానికి 23 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, దీపాంకర్ భట్టాచార్య, మెహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, బ్రివన్ థోల్ తదితరులు ఉన్నారు. అయితే, కీలక భాగస్వాములైన డీఎంకే, ఆప్ పార్టీలు మాత్రం సమావేశానికి దూరంగా ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో భారీ ఈదురుగాలులు.. మూడు విమానాల ధ్వంసం..

ఇండియా కూటమి సమావేశానికి వర్చువల్‌గా హాజరు కానున్న ఉద్ధవ్ థాకరే

Updated Date - Jun 08 , 2026 | 03:32 PM