రాజ్యసభకు టీఎంసీ ఎంపీ రాజీనామా, కేంద్ర మంత్రిని కలిసిన 11 మంది ఎంపీలు
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:12 PM
తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Roy) తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీని వీడుతున్నట్టు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆయన లేఖ రాశారు. మరో ఎంపీ కోయల్ మల్లిక్ కూడా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

టీఎంసీ సీనియర్ నేతల్లో ఒకరైన సుఖేందు రాజీనామా అనంతరం ఆ పార్టీలో వేగంగా రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా సుఖేందును 11 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు న్యూఢిల్లీలో కలుసుకున్నారు. టీఎంసీ చీలిక వర్గంగా ఏర్పడేందుకు గల అవకాశాలపై ఎంపీలంతా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని చెబుతున్నారు.
కేంద్ర మంత్రి, సీఎం సువేందును కలిసిన ఎంపీలు
కాగా, టీఎంసీకి రాజీనామా చేసిన సుఖేందు శేఖర్, మరో 11 మంది టీఎంసీ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను న్యూఢిల్లీలో కలుసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. హాజరైన 11 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీల్లో హౌరా ఎంపీ ప్రసూన్ బెనర్జీ, బర్దమాన్ పూర్బ ఎంపీ షర్మిలా సర్కార్, బంకురా ఎంపీ అరూప్ చక్రవర్తి, ఝాగ్రామ్ ఎంపీ కలిపాడా సోరెన్, కూచ్ బెహర్ ఎంపీ జగదీష్ చంద్ర బసునియా, బరాసత్ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్, బరాక్‌పోర్ ఎంపీ పార్థ భౌమిక్, ముధురాపూర్ ఎంపీ బాపి హల్దార్, బీర్భూమ్ ఎంపీ శతాబ్ది రాయ్, బోల్‌పూర్ ఎంపీ అసిత్ కుమర్ మల్, మేదినీపూర్ ఎంపీ జూన్ మలియా ఉన్నారు.
సుఖేందు ఘాటు లేఖ
పార్టీలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని తన రాజీనామా లేఖలో సుఖేందు శేఖర్ ప్రస్తవించారు. మహిళల అణిచివేత, విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశ్రమ, ఉపాధి, శాంతిభద్రతలతో సహా పలురంగాల్లో నెలకొన్న అరాచకాన్ని ప్రజలు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. బెంగాల్ చరిత్రలో తొలిసారి ఓటర్లుకు బీజేపీకి భారీ విజయాన్ని అందించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కొత్త ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు. ఢిల్లీలో సోమవారంనాడు జరిగిన 'ఇండియా' కూటమి సమావేశంలో మమతాబెనర్జీ పాల్గొన్న సమయంలో ఈ కీలక పరిణామాలు చేటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..
నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్ అరెస్ట్