Share News

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:05 PM

పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేపాల్ సరిహద్దుల్లో టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్
TMC Leader Jahangir Khan Arrested Near Nepal Border After Falta Election Controversy

కోల్‌కతా, జూన్ 8: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలవరం సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గత కొన్ని రోజులుగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను పశ్చిమ బెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సోమవారం తెల్లవారుజామున వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకుంది. దేశం దాటి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ అధికారులు ఆయన ఆట కట్టించారు. జహంగీర్ ఖాన్‌పై బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాల జిల్లా ఫాల్తా పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద 7 క్రిమినల్ కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదయ్యాయి. వీటిలో ప్రధానంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, భూఅక్రమణలు, మహిళలను వేధించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.


తనపై నమోదైన వరుస కేసుల్లో పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని జహంగీర్ ఖాన్ గతంలో కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మే 18న కోర్టు ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించినప్పటికీ, తాజాగా ఆ రక్షణను న్యాయస్థానం ఉపసంహరించుకుంది. కేవలం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయనో, లేదా దీని వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందనే పిటిషనర్ వాదనల ఆధారంగా క్రిమినల్ కేసుల్లో రక్షణను పొడిగించలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.


ఖాన్ లాయర్ వాదన: మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తన క్లయింట్‌పై కావాలనే వరుస కేసులు పెట్టారని, ఇదంతా రాజకీయ పగతో జరుగుతున్న వేధింపులని జహంగీర్ ఖాన్ తరఫు సీనియర్ న్యాయవాది కిషోర్ దత్తా కోర్టులో వాదించారు.

ప్రభుత్వ లాయర్ కౌంటర్: అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాజ్‌దీప్ మజుందార్ ఈ వాదనను గట్టిగా వ్యతిరేకించారు. మే 21న ఫాల్తా నియోజకవర్గంలో జరిగిన రీ-పోలింగ్‌లో ఖాన్ పాల్గొనేందుకు మాత్రమే గతంలో కోర్టు రక్షణ ఇచ్చిందని, మే 24న ఫలితాలు కూడా వచ్చేసినందున ఇక ఆ ప్రొటెక్షన్‌ను పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


మమతా బెనర్జీకి షాక్.. నామినేషన్ ఉపసంహరణ:

కాగా, ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గ రీ-పోలింగ్ సమయంలో బెంగాల్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇస్తూ జహంగీర్ ఖాన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఫాల్తా ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు.

'నేను ఫాల్తా బిడ్డను. ఇక్కడ ప్రశాంతత, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాను. మన ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్తా అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. అందుకే నేను ఈ రీ-పోలింగ్ రేస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను' అని జహంగీర్ ఖాన్ పేర్కొనడం గమనార్హం.

బీజేపీ ఒత్తిడే కారణమన్న టీఎంసీ:

జహంగీర్ ఖాన్ నామినేషన్ ఉపసంహరణపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ప్రభుత్వం తమ నేతలపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చిందని, టీఎంసీ పార్టీ కార్యాలయాలపై దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురిచేయడం వల్లే ఖాన్ ఎన్నికల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆరోపించింది. ఏదేమైనా, కోర్టు రక్షణ కోల్పోయిన కొద్దిరోజులకే ఈ కీలక నేత నేపాల్ బోర్డర్‌లో ఎస్టీఎఫ్ చేతికి చిక్కడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టాము: ఎల్ఐసీ సీఈఓ

ఆచితూచి అడుగేయండి.. ఇన్వెస్టర్లకు నిపుణులు సూచన

Updated Date - Jun 08 , 2026 | 12:36 PM