Share News

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:38 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) దీర్ఘకాలిక పెట్టుబడి సాఽధనాల కోసం చూస్తోంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీలతో పాటు..

దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి

రెగ్యులేటరీ సంస్థలతో చర్చిస్తున్నాం

ఎల్‌ఐసీ చీఫ్‌ దొరైస్వామి

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) దీర్ఘకాలిక పెట్టుబడి సాఽధనాల కోసం చూస్తోంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), సెబీలతో పాటు బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐతోనూ చర్చలు జరుపుతున్నట్టు ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్‌ దొరైస్వామి చెప్పారు. కొన్ని యాన్యుటీ పాలసీలపై 30 నుంచి 40 ఏళ్ల పాటు యాన్యుటీలు చెల్లించాల్సి ఉన్నందున, తమకు మరిన్ని దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉండడం తప్పనిసరి అన్నారు. ‘ప్రస్తుత మార్కెట్లో ఎక్కువ మంది పాలసీదారులు యాన్యుటీ పాలసీలే తీసుకుంటున్నారు. దాంతో ఆ పాలసీల్లోకే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి. మేము ఆ యాన్యుటీ చెల్లింపులకు అనుగుణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి పెట్టుబడి సాధనాల కోసం ఐఆర్‌డీఏఐతో పాటు సెబీ, ఆర్‌బీఐ వంటి నియంత్రణ సంస్థలతోనూ చర్చలు జరుపుతున్నాం’ అని చెప్పారు.

ఐఆర్‌డీఏఐ కూడా మారుతున్న మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పెట్టుబడి సాధనాలను గుర్తించే పనిలో ఉందని దొరైస్వామి తెలిపారు.

ఫిన్‌టెక్‌ యోచన

ఫైనాన్షియల్‌ టెక్నాలజీ (ఫిన్‌టెక్‌) కంపెనీని ఏర్పాటు చేసే విషయాన్నీ ఎల్‌ఐసీ చురుగ్గా పరిశీలిస్తోంది. అయితే ఇలాంటి కంపెనీలను సొంతంగా ఏర్పాటు చేయాలా? లేక ఇప్పటికే ఉన్న ఏదైనా ఫిన్‌టెక్‌ కంపెనీలో భాగస్వామ్యం తీసుకోవాలా? అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని దొరైస్వామి చెప్పారు. ఎల్‌ఐసీ ఈక్విటీలో మరింత వాటా విక్రయంపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమన్నారు. తొలి ఐపీఓ నుంచే తాము అందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

Updated Date - Jun 08 , 2026 | 01:38 AM