Share News

సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:01 PM

సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్‌‌కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్‌లోని టీఎంసీ కార్యాలయానికి సీఐడీ బృందం మంగళవారంనాడు వెళ్లింది. అయితే సీఐడీ టీమ్‌ను కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని తెలుస్తోంది.

సంతకాల ఫోర్జరీ కేసు.. మమతా బెనర్జీ కార్యాలయానికి సీఐడీ టీమ్
CID Team

కోల్‌కతా: ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్‌ (TMC)కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్‌లోని టీఎంసీ కార్యాలయానికి సీఐడీ బృందం మంగళవారంనాడు వెళ్లింది. అయితే సీఐడీ టీమ్‌ను కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని తెలుస్తోంది. టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నివాసానికి ఆనుకుని ఈ కార్యాలయం ఉంది.


తొలుత ఖాళీఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని వెంట తీసుకుని సీఐడీ బృందం టీఎంసీ కార్యాలయానికి వెళ్లింది. కార్యాలయం వద్ద వేచిచూస్తుండగా వారిని కలిసేందుకు టీఎంసీ మాజీ ఎంపీ, పార్టీ కోశాధికారి సుభాశిష్ చక్రవర్తి బయటకు వచ్చారు. మమతా బెనర్జీ , టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీలు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్నారని సీఐడీ బృందానికి చక్రవరి తెలియజేశారు. వారు లేకుండా లోపలకు అనుమతించలేమని చెప్పారు. అయితే విచారణలో భాగంగానే తాము వచ్చామనీ, సంబంధితులు ఎవరూ ఉండాల్సిన పని లేదని సీఐడీ అధికారుల తెలిపారు. అభిషేక్‌కు ఇచ్చిన నోటీసును చూపిస్తూ, సెర్చ్ ఆపరేషన్‌కు సహకరించాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కామాక్ స్ట్రీట్‌లోని అభిషేక్ బెనర్జీ నివాసానికి కూడా ఒక సీఐడీ టీమ్ వెళ్లిందని సమాచారం.


నకిలీ సంతకాల కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను సహకరిస్తున్న సీఐడీ టీమ్ గత మే 30న తొలిసారి అభిషేక్ ఖాళీఘాట్ నివాసానికి వెళ్లింది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే తనకు 14 రోజులు గడువు ఇవ్వాలని అభిషేక్ కోరారు. ఆయన చేసిన విజ్ఞప్తిని సీఐడీ తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా తమ ముందు హాజరుకావాలని తాజా నోటీసు ఇచ్చింది. అయితే సోమవారంతో ఆ గడువు ముగిసినప్పటికీ సీఐడీ విచారణకు అభిషేక్ హాజరుకాలేదు.


పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ, ప్రతిపక్ష ఉపనాయకులుగా అసిమా పాత్రా, నైనా బంద్యోపాధ్యాయ, చీఫ్ విప్‌గా ఫిర్హాద్ హకీంల నియామకానికి సంబంధించి అసెంబ్లీకి సమర్పించిన పత్రాలపై పలువురు టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.


ఇవి కూడా చదవండి...

లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ

రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం

Updated Date - Jun 09 , 2026 | 05:51 PM