రిజైన్ చేసి హ్యాపీగా వెళ్లిపోవచ్చు... రెబల్ ఎంపీలకు టీఎంసీ ఘాటు సందేశం
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:12 PM
టీఎంసీ తిరుగుబాటు ఎంపీలపై ఆ పార్టీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మండిపడ్డారు. ద్వంద్వ వైఖరి కలిగిన వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. పార్టీ పట్ల అంతగా అసంతృప్తి ఉంటే వాళ్లు రాజీనామా చేయాలన్నారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (TMC) తిరుగుబాటు ఎంపీలు పలువురు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో కలిసి పనిచేయనున్నట్టు ప్రకటించడంపై ఆ పార్టీ అధినాయకత్వం తొలిసారి స్పందించింది. ఇది ముమ్మాటికీ నయవంచనేనని టీఎంసీ సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) అన్నారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ద్వంద్వ వైఖరి కలిగిన వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని అన్నారు. పార్టీ పట్ల అంతగా అసంతృప్తి ఉంటే వాళ్లు రాజీనామా చేయాలన్నారు.
'రెండు రకాల వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు వెళ్లిపోతే మాకు కూడా చాలా సంతోషం. వెళ్లిపోవాలనుకునే వాళ్లు వెళ్లిపోవచ్చు. మాకెలాంటి అభ్యంతరాలులేవు. అయితే మీరు తృణమూల్ కాంగ్రెస్ పేరును మాత్రం తీసుకెళ్ల లేరు. ప్రజలకు నిజం ఏమిటో తెలుసు, వాళ్లు మావెంటే నిలుస్తారు' అని కల్యాణ్ బెనర్జీ అన్నారు. పార్టీతో ఎవరికైనా విభేదాలుండి పార్టీలో ఇమడలేమని అనుకున్నా, ఇందుకు బదులుగా ఎవరికైనా మద్దతు ఇవ్వాలని అనుకున్నా పార్టీకి రాజీనామా చేయడం కనీస నైతిక బాధ్యత అని అన్నారు.
లేఖ ఎందుకు బయటపెట్టడం లేదు?
తిరుగుబాటు ఎంపీలు లోక్‌సభ స్పీకరుకు లేఖ రాసి ఉంటే అందులోని సమాచారం ఎందుకు బయటపెట్టడం లేదని కల్యాణ్ బెనర్జీ ప్రశ్నించారు. 'ఎంతమంది ఆ లేఖలో సంతకం చేశారో, ఎందరు చేయలేదో నాకు తెలియదు. దీనిపై ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నారో కూడా తెలియదు. లేఖ రాసిన 24 గంటల తర్వాత కూడా ఎందుకు దానిలోని విషయాలను బహిరంగం చేయడం లేదు. ఎవరూ ఆ లేఖను చూడలేదు. ఇలాంటి కీలక విషయంలో నిజాయితీ అనేది అవసరం' అని అన్నారు. తిరుగుబాటు ఎంపీలకు మరో పార్టీతో విలీనం అయ్యేంత సంఖ్యాబలం లేదన్నారు. అందువల్ల ఏ ఒక్క ఎంపీని బీజేపీ తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్‌గా కల్యాణ్ బెనర్జీ.. స్పీకర్‌కు మమత లేఖ
పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ కోసం ఎన్‌డీయే ప్రయత్నాలు!