Share News

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ కోసం ఎన్‌డీయే ప్రయత్నాలు!

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:48 PM

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ దక్కించుకునేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ కోసం ఎన్‌డీయే ప్రయత్నాలు!
NDA Strength in Parliament

ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంటులో కూడా టీఎంసీ ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరవేయవచ్చన్న వార్తల నడుమ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గ పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో లోక్‌సభలో కూడా ఎన్‌‌డీఏ మూడింట రెండు వంతుల స్పెషల్ మెజారిటీ సాధించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల అధికార పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ బిల్లుపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. దీంతో, స్పెషల్ మెజారిటీ మార్కు 352గా మారింది. ఇందులో 298 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 230 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అనుకూల ఓట్లు మేజిక్ ఫిగర్‌ను (352 ఓట్లు) దాటకపోవడంతో బిల్లు వీగిపోయింది. స్పెషల్ మెజారిటీ సాధించాలంటే ఓటింగ్‌లో పాల్గొనే సభ్యులలో మూడింట రెండు వంతుల (2/3) మంది బిల్లుకు మద్దతు ఇవ్వాలి. వీరి సంఖ్య సభ మొత్తం సభ్యుల సంఖ్యలో (543) సగానికి పైగా ఉండాలి. ఈ రెండూ కుదిరితేనే స్పెషల్ మెజారిటీగా పరిగణిస్తారు.


పార్లమెంటు వేదికగా తృణమూల్‌లో చీలిక తప్పదన్న అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార ఎన్‌డీఏ కూటమి సంఖ్యాబలం స్పెషల్ మెజారిటీకి మరింత చేరువ అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనకు 20 ఎంపీల మద్దతు ఉందని టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ పేర్కొన్నారు. చట్టప్రకారం టీఎంసీలో చీలిక తెచ్చేందుకు ఆయనకు మరో ఎంపీ మద్దతు అవసరం. తరువాత వీరంతా లోక్‌సభలో ఒక బృందంగా ఎన్డీయేకు మద్దతు పలికే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే జరిగితే ఎన్‌డీఏ సంఖ్యా బలం 300 మార్కు దాటుతుంది. ఇక డీఎంకే ఎంపీలు కూడా ఎన్‌డీఏకు కొన్ని షరతులకు లోబడి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఎన్‌డీఏకు ప్రస్తుతం లోక్‌సభలో 293 మంది ఎంపీలు ఉన్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు మద్దతు కూడా లభిస్తే సంఖ్యాబలం 313కు పెరుగుతుంది. 22 మంది డీఎంకే ఎంపీల మద్దతూ సాధించగలిగితే ఇది 335కు చేరుతుంది. మహారాష్ట్ర నేత ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనకు చెందిన 9 మంది ఎంపీల మద్దతును కూడగట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరిలో కొందరి మద్దతు లభించినా ఎన్‌డీఏ సంఖ్యా బలం 341కు పెరుగుతుంది. మిగిలిన ఓట్లను చిన్న పార్టీలు, స్వతంత్ర ఎంపీల రూపంలో సాధించుకోవచ్చని ఎన్‌డీఏ భావిస్తున్నట్టు సమాచారం.


రాజ్యసభలో కూడా మూడింట రెండు వంతుల స్పెషల్ మెజారిటీని (164) కూడగట్టేందుకు ఎన్‌డీఏ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మళ్లీ ఎన్నికై బీజేపీకి మద్దతు పలికే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. మిగిలిన 12 టీఎంసీ ఎంపీలు ఇదే ఫార్ములా ఫాలో అయ్యే అవకాశం ఉంది. 8 మంది డీఎంకే ఎంపీలు కూడా షరతులకు లోబడి ఎన్‌డీఏ ఈ బిల్లు విషయంలో మద్దతు తెలిపే ఛాన్సు ఉంది. ఇతర చిన్న పార్టీల మద్దతు కూడా కూడగడితే పెద్దల సభలో కూడా ఎన్‌డీఏ పైచేయి సాధించే ఛాన్స ఉన్నట్టు సమాచారం.


ఈ వార్తలనూ చదవండి:

మనీల్యాండరింగ్ కేసు.. పినరయి విజయన్ కూతురికి ఈడీ సమన్లు

డీకేకు తప్పని తిప్పలు.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు..

Updated Date - Jun 09 , 2026 | 02:16 PM