Share News

విదేశీ శక్తుల మద్దతుతో అరాచకానికి కుట్ర? ఇమ్రాన్ ఖాన్, రాహుల్ గాంధీపై చిరాగ్ పాశ్వాన్ విమర్శలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:18 PM

ఎస్‌ఐఆర్‌ వివాదం, ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్లపై జరుగుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు జారీ చేసిన ‘లీవ్ ఇండియా’ నోటీసులను సమర్థించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ ముందుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విదేశీ శక్తుల మద్దతుతో అరాచకానికి కుట్ర? ఇమ్రాన్ ఖాన్, రాహుల్ గాంధీపై చిరాగ్ పాశ్వాన్ విమర్శలు
Chirag Paswan Rahul Gandhi Remarks

Chirag Paswan Rahul Gandhi Remarks: భారతదేశంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వివాదం, ఎన్నికల కమిషన్ తొలగింపు డిమాండ్ల నిరసనలపై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఆందోళనల్లో విదేశీ శక్తుల మద్దతుతో దేశంలో ఆరాచకం సృష్టించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌లో జరిగిన ఆందోళనలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడంపై పశ్వాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘకాలం భారతదేశంలో నటుడిగా పనిచేసినప్పటికీ, ఆయన అమెరికా పౌరసత్వం ఉన్న వ్యక్తి అని గుర్తుచేశారు. భారత పౌరులు నిరసనలు తెలిపితే గౌరవిస్తామని, కానీ ఓసీఐ(OCI) కార్డ్ కలిగిన విదేశీ పౌరులు అంతర్గత అంశాల్లో ఆందోళనలు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. ఫారినర్స్ యాక్ట్ ఉల్లంఘన ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్‌కు లభించిన 'లీవ్ ఇండియా' (అక్టోబర్ 28 నాటికి దేశం విడిచి వెళ్లాలని) నోటీసులను చిరాగ్ పాశ్వాన్ సమర్థించారు.

కోల్‌కతా తొక్కిసలాట.. రాహుల్ గాంధీ-అమిత్ షాలకు పోలిక

కోల్‌కతాలోని దుర్గాపూజ పండల్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంతో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే స్పందించి తన రాజకీయ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని బాధితులను పరామర్శించారని కొనియాడారు.

అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గోవాలో జరగనున్న ఎన్నికల ర్యాలీలకు ప్రాధాన్యమినిస్తూ పర్యటించడంపై మండిపడ్డారు. ఒకవైపు మానవత్వంతో వ్యవహరించే నాయకులు ఉంటే, మరోవైపు ప్రజల ప్రాణాల కంటే రాజకీయాన్నే మిన్నగా భావించే ప్రతిపక్ష నేతలు ఉన్నారని విమర్శించారు.

రాహుల్ గాంధీకి సవాల్

ఇటీవల 'ఎస్ఐఆర్' ప్రక్రియను తప్పుబడుతున్న రాహుల్ గాంధీకి చిరాగ్ పాశ్వాన్ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రక్రియ ద్వారానే లోక్‌సభ స్థానాల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు గెలిచారని, ఆ వ్యవస్థనే ప్రశ్నించాలనుకుంటే ముందుగా రాహుల్ గాంధీ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అలా అనుండాల్సింది కాదు.. ‘నిర్బంధ సేవకుల’ కామెంట్స్‌పై వాన్స్ వివరణ

అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు

Updated Date - Oct 18 , 2026 | 05:31 PM