Share News

అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:14 AM

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. మాస్కులు ధరించిన అనేక మంది నిరసనకారులు పోలీసులపై దాడులతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు. కొన్ని లగ్జరీ షాపుల్లో లూటీలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు
France protests - Shocking Scenes

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో భయానక వాతావరణం నెలకొంది. ప్రజల నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో దేశం అట్టుడుకుతోంది. మాస్కులు ధరించిన వేల మంది నిరసనకారులు పోలీసులపై దాడులు చేస్తూ లూటీలకు తెగబడ్డారు. భవనాలకు నిప్పు పెట్టారు. దీంతో, ముఖ్య నగరాల్లో అరాచక వాతావరణం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.


మీడియా కథనాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5 లక్షల మంది వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, ఆర్థిక అసమానతలు, దిగజారిన ప్రజాసేవల నాణ్యతకు వ్యతిరేకంగా కదనుతొక్కుతున్నారు. దేశవ్యాప్తంగా 5.5 లక్షల మంది నిరసనకు దిగారని అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. వాస్తవ సంఖ్య ఇంతకంటే ఎక్కువేనని నిరసనకారులు చెబుతున్నారు. రాజధాని పారిస్‌లో 1.1 లక్షల మంది నిరసనకు దిగడంతో నగరంలో భయానకవాతావరణం నెలకొంది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో 1200 మందిని పోలీసులు ఇప్పటివరకూ అరెస్టు చేశారు. నిరసనకారులతో ఘర్షణల్లో 150 మంది పోలీసులు గాయపడ్డారు. పోలీసులు, వారి వాహనాలపై ప్రజలు రాళ్లు రువ్విన దృశ్యాలు వైరల్‌గా మారాయి.


గత నెలలో విద్యార్థులతో ప్రారంభమైన నిరసనల్లో ప్రస్తుతం కార్మిక సంఘాలు, ఇతర వర్గాలు చేరడంతో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయి. సామాన్యుల కష్టాల విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని నిరసనకారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పలు భవనాలకు నిరసనకారులు నిప్పుపెట్టడంతో భయోత్పాతం నెలకొంది.


పారిస్‌లో శనివారం మధ్యాహ్నం శాంతియుతంగా ప్రారంభమైన నిరసన సాయంత్రాని కల్లా తీవ్ర రూపం దాల్చింది. నిరసనకారులు వీధుల్లో నిప్పు రాజేశారు. వాహనాలను దహనం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. కొన్ని షాపుల్లో లూటీలు కూడా జరిగాయి. బోర్డోలోని లూయి వొట్టాన్ షాపులో, లిల్లీలోని యాపిల్ స్టోర్‌లో ఆగంతుకులు అందినకాడికి దోచుకెళ్లారు. దుస్తులు, ఆహార దుకాణాలను కూడా టార్గెట్ చేశారు. లిల్లీ, మార్సియెల్ నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లోకి దూసుకెళ్లి రణరంగం సృష్టించారు. చారిత్రక కట్టడమైన సిటీ టూరిస్టు ఆఫీసును కూడా వదిలిపెట్టకపోవడంతో లియోన్ నగర మేయర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లిమోజెస్ సిటీలోని టౌన్ హాల్‌లో కూడా మంటలు చెలరేగడంతో గంట ఉన్న టవర్ కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. గ్రెనోబిల్ నగరంలో కొందరు నిరసనకారులు ఓ టూరిస్టు ట్రెయిన్‌తో పోలీసుల వైపు దూసుకెళ్లారు.


ఈ ఘర్షణల్లో నిరసనకారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గ్రెనేడ్ పేలడంతో ఓ వ్యక్తి తన చేయిని కోల్పోవాల్సి వచ్చింది. మాస్కులు పెట్టుకున్న కొందరు కొన్ని స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకుని పారిస్, మార్సియెల్, రెన్నే, టోలూస్, ఆంగర్స్ వంటి నగరాల్లో అరాచకం సృష్టిస్తున్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడులు, లూటీలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ తేల్చి చెప్పారు. పోలీసులు తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలు ఎదుర్కొంటున్నారని ఫ్రాన్స్ ప్రధాని లికోర్నూ అన్నారు. హింస ద్వారా రాజకీయ ఎజెండాను అమలు చేయడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు ఇది అనువైన సమయం అంటూ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఒక్క రాత్రిలో అది సాధ్యం కాదు.. భారత్‌పై యూఎస్ మంత్రి వ్యాఖ్య

రణరంగంగా మారిన ఫ్రాన్స్..

Updated Date - Oct 18 , 2026 | 11:56 AM