భారత్‌కు జిన్‌పింగ్ రాక?.. బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశం!
ABN , Publish Date - Jul 31 , 2026 | 02:15 PM
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ను సందర్శించే అవకాశముంది. ఇదే జరిగితే 2019 తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఇంటర్నెట్ డెస్క్: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ను సందర్శించే అవకాశమున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన ఖరారైతే.. 2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం జిన్‌పింగ్ భారత్‌కు రావడమిదే తొలిసారి కానుంది.
జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు, గల్వాన్ ఘర్షణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం సైనిక, దౌత్య స్థాయిలో పలు దఫాలుగా చర్చలు కొనసాగుతున్నాయి. చైనా అధ్యక్షుడి పర్యటనకు ముందు ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ త్వరలో చైనాలో పర్యటించే అవకాశాలూ కనిపిస్తున్నాయి. అలాగే భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్(WMCC) సమావేశం కూడా జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ మేరకు సరిహద్దు వివాదంపై ప్రత్యేక ప్రతినిధుల మధ్య త్వరలో సమావేశం నిర్వహించే అవకాశముంది. సరిహద్దు సమస్యల పరిష్కారానికి కొత్త నిపుణుల బృందం, వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటుచేయాలని ఇటీవల ఇరు దేశాలు అంగీకరించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరిచుకుంది. జిన్‌పింగ్ భారత పర్యటన ఖరారైతే.. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్, చైనా నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముంది. సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలకాంశాలు చర్చకు రావచ్చు. అయితే.. జిన్‌పింగ్ భారత పర్యటనపై ఇప్పటివరకు ఇటు ఢిల్లీ గానీ, అటు బీజింగ్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.
ఇవీ చదవండి:
'నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది'.. న్యాయం చేయండి ప్లీజ్.!
మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు