Share News

ఆ వైద్య పరికరాలపై నిషేధం అమలు చేయండి.. కేంద్రం ఆదేశం

ABN , Publish Date - Oct 24 , 2026 | 03:47 PM

ఒకసారి వాడిపారేసే (సింగిల్ యూజ్) వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువుల పునర్వినియోగంపై ఉన్న నిషేధం కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ వైద్య పరికరాలను మళ్లీ వాడితే ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంటుందని పేర్కొంది.

ఆ వైద్య పరికరాలపై నిషేధం అమలు చేయండి.. కేంద్రం ఆదేశం

ఇంటర్నెట్ డెస్క్: ఒకసారి వాడిపారేసే (సింగిల్ యూజ్) వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువుల పునర్వినియోగంపై ఉన్న నిషేధం కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ వైద్య పరికరాలను మళ్లీ వాడితే ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా అలాంటి పరికరాలకు రోగుల నుంచి పూర్తి చార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సింగిల్ యూజ్ వైద్య పరికరాలను మళ్లీ వాడకుండా కఠినంగా నిషేధం అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, యూటీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) ఈనెల 16న లేఖ రాసింది.


ఒకసారి వాడిపారేసే మెడికల్ డివైజెస్‌ను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో స్టెరిలైజ్ చేసి మళ్లీ వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా కార్డియోలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ, వ్యాస్కులర్ సర్జరీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల్లో అలాంటి ఐటమ్స్ వాడుతున్నట్లు తెలిసిందని డీజీహెచ్ఎస్ వెల్లడించింది. అలాంటి మెడికల్ డివైజెస్‌లో కార్డియాక్ క్యాథటర్స్, గైడ్‌వైర్స్, బెలూన్ అండ్ అబ్లేషన్ క్యాథటర్స్, డయాలసిస్ పరికరాలు, సర్జికల్ స్టేప్‌లర్స్, ల్యాప్రోస్ర్కోపిక్ ట్రాకార్స్, ఆర్థోపెడిక్ డ్రిల్ బిట్లు, సిరంజీలు, సూదులు ఉన్నాయని వివరించింది. అలాంటి పరికరాలను స్టెరిలైజ్ చేసి వాడినా ఇన్ఫెక్షన్ ముప్పు ఉంటుందని, అంతేకాకుండా హెపటైటిస్ బీ, సీతో పాటు హెచ్ఐవీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా ఉండవచ్చని తెలిపింది.


ఒకసారి వాడిపారేసే పరికరాలను మళ్లీ వాడడం సేఫ్ కాదని డీజీహెచ్‌ఎస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అలాంటి డివైజెస్ పునర్వియోగంపై కఠినంగా నిషేధం అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలకు డీజీహెచ్ఎస్ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940, మెడికల్ డివైజెస్ నిబంధనలు 2017, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2010 ప్రకారం అటువంటి పరికరాలను మళ్లీ వాడకూడదని వెల్లడించింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాలని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..


మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 24 , 2026 | 05:17 PM