పెళ్లి పేరుతో 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు టోకరా.. రూ.24 లక్షలు కాజేసిన కేటుగాడు!
ABN , Publish Date - Oct 24 , 2026 | 01:03 PM
ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన జీవితం ఉన్నట్లు చూపిస్తూ మహిళా పోలీసు కానిస్టేబుళ్లను మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఖరీదైన కార్లలో తిరగడం వంటి విలాసవంతమైన జీవనశైలి ఉన్నట్లుగా కనిపించే ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం.. పెద్ద వ్యాపారవేత్తగా కనిపిస్తూ.. ఓ కేటుగాడు మహిళా కానిస్టేబుళ్లతో పరిచయం పెంచుకున్ని మోసం చేశాడు. ఢిల్లీకి చెందిన విక్రాంత్ తోమర్ అనే యువకుడు పెళ్లి పేరుతో దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్ల నుంచి రూ.24 లక్షల వరకు మోసం చేశాడు. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం బయటబడింది. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం..
ఢిల్లీలోని బురారి ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల విక్రాంత్ తోమర్ అనే యువకుడు సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విలాసవంతమైన కార్లు, రిచ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తను ఒక పెద్ద వ్యాపారవేత్తనని నమ్మబలికాడు. ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఒకే బ్యాచ్‌కు చెందిన మహిళా కానిస్టేబుళ్లను తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి నుంచి విడతల వారీగా రూ. 24 లక్షల వరకు కాజేశాడు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే... నిందితుడు విక్రాంత్ తోమర్ సహజీవనం (Live-in partner) చేస్తున్న మహిళ కూడా ఢిల్లీ పోలీసు శాఖలోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె ద్వారానే తన బ్యాచ్‌కి చెందిన తోటి మహిళా కానిస్టేబుళ్ల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ఇతను టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వీరిలో కొందరు మాత్రమే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారు.
బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును 'వన్-ఎక్స్' (OneX) బెట్టింగ్ యాప్‌తో అనుసంధానించిన ఖాతాలకు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఇప్పటికే మాయాపురి, హరి నగర్, ఇందర్‌పురి తదితర ప్రాంతాల్లో ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదై ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లోనే అతను బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ సెంట్రల్ జిల్లా సైబర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరువు పోతుందనే భయంతో మరికొందరు బాధితులు ఇంకా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు..
చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక శివానందన్!
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మాతో రోహిత్ డ్యాన్స్.. వీడియో వైరల్