Share News

చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక శివానందన్!

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:44 AM

చెస్‌లో భారత సంతతి బ్రిటన్ బాలిక బోధన శివానందన్ (11) చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) హోదాను దక్కించుకున్న అతి పిన్నవయస్కురాలైన అమ్మాయిగా శివానందన్ రికార్డు సృష్టించింది.

చరిత్ర సృష్టించిన భారత సంతతి బాలిక శివానందన్!
Bodhana Sivanandan

స్పోర్ట్స్ డెస్క్: చెస్‌లో భారత సంతతి బ్రిటన్ బాలిక బోధన శివానందన్ (11) చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ మాస్టర్ (IM) హోదాను దక్కించుకున్న అతి పిన్నవయస్కురాలైన అమ్మాయిగా శివానందన్ రికార్డు సృష్టించింది. కేవలం 11 ఏళ్ల 7 నెలల16 రోజుల వయసులోనే ఈ ఘనతను సాధించింది. గతంలో ఈ రికార్డు చెస్ దిగ్గజం జుడిత్ పోల్గర్ పేరిట ఉండేది. 1988లో జుడిత్ పోల్గర్ ఈ అరుదైన ఘనత సాధించగా... దాదాపు 60 ఏళ్ల తర్వాత తాజాగా బోధన బద్దలు కొట్టింది. నెల క్రితం అతి పిన్న వయసులో ఉమెన్ గ్రాండ్‌మాస్టర్ (WGM) ఘనతను సాధించిన బోధన.. తాజాగా ఐఎం సాధించడం ద్వారా మరో మైలురాయిని అందుకుంది.


మొత్తం చెస్ చరిత్రలో (మహిళలు, పురుషులు కలిపి) ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించిన అతి పిన్న వయస్కుల్లో ఈ భారతీయ-బ్రిటన్ అమ్మాయి ఏడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బోధన.. భారత స్టార్ ప్లేయర్ గుకేశ్(9వ స్థానం) రికార్డును కూడా వెనక్కి నెట్టింది. లండన్‌లోని హారోలో పెరిగిన బోధన.. పాఠశాల విద్యతో పాటు చెస్‌ను సమన్వయం చేసుకుంటూ ఈ అద్భుత విజయాన్ని సాధించడం విశేషం.


బోధన తల్లిదండ్రులు తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందినవారు. ఉపాధి నిమిత్తం 2007లో యూకేకి వలస వెళ్లగా.. లండన్‌లో జన్మించిన బోధన ఐదేళ్ల వయసులోనే చెస్ బోర్డుతో పరిచయం ఏర్పరచుకుంది. ఆ తర్వాత క్రమంగా ఆటపై మక్కువ పెంచుకుని అంచెలంచెలుగా ఎదిగింది. తన అతితక్కువ కెరీర్‌లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ (WIM), ఉమెన్ ఫైడ్ మాస్టర్ (WFM) వంటి రికార్డులతో పాటు, గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కురాలిగానూ ఆమె గుర్తింపు తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో తాను గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్ కూడా సాధిస్తానని బోధన ధీమా వ్యక్తం చేసింది. ఈ చిన్నారి విజయాలపై క్రీడా ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీపై దినేశ్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు..

బాలీవుడ్ హీరోయిన్‌ కరిష్మాతో రోహిత్ డ్యాన్స్.. వీడియో వైరల్

Updated Date - Oct 24 , 2026 | 09:56 AM