పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. 27న అఖిలపక్షం
ABN , Publish Date - Jan 24 , 2026 | 07:35 PM
జనవరి 28తో ప్రారంభమయ్యే తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారంనాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉభయసభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈనెల 27న అఖిలపక్ష సమావేశం (All party meeting) ఏర్పాటు చేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు సంప్రదాయం ప్రకారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 27వ తేదీన పార్లమెంట్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చేపట్టనున్న లెజిస్లేటివ్, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జనవరి 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ
జనవరి 28తో ప్రారంభమయ్యే తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారంనాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉభయసభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. సీతారామన్ వరుసగా ప్రవేశపెడుతున్న తొమ్మిదవ బడ్జెట్ ఇది. ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకూ రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. దీనితో పాటు వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు-2025, ది సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్-2025, రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024పై సభలో చర్చ ఉంటుంది. ఈ బిల్లులను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి లేదా సెలెక్ట్ కమిటీలకు పంపనున్నారు.
కాగా, గత శీతాకాల సమావేశాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్‌ఈజీఏ) స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ్) చట్టంపైనా పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం చేసిన ఈ మార్పుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించడంతో పాటు కొత్త చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రచారం సాగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌పైనే అభిప్రాయ భేదాలు.. శశిథరూర్ వెల్లడి
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు కస్టడీ పెరోల్
Read Latest National News