Betting Sites Blocked: అక్రమ బెట్టింగ్, జూదంపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్లు బ్లాక్
ABN , Publish Date - Jan 16 , 2026 | 09:31 PM
ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భారతదేశంలో పెరుగుతున్న ఆన్‌లైన్ ఆర్థిక నేరాలు, యువత వ్యసనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
ఢిల్లీ, జనవరి16 (ఆంధ్రజ్యోతి): అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ జూదంపై(Betting Sites Blocked) కేంద్ర ప్రభుత్వం (Central Government) కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. యువతను మత్తులోకి నెట్టేస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా 242 బెట్టింగ్, జూదం వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. అంతేకాదు.. ఇప్పటివరకు బెట్టింగ్, జూదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8 వేల వెబ్‌సైట్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై నిషేధం విధించిన కేంద్రం.. ఇప్పుడు అక్రమ వెబ్‌సైట్లపైనా ప్రత్యేక దృష్టి సారించింది.
యువత భవిష్యత్తుపై ప్రభావం..
బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం కారణంగా యువత పెడదోవ పడుతున్నట్లు గుర్తించింది. దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఘటనలు పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పరిణామాలు సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న నేపథ్యంలోనే కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025 అమలు..
గతేడాది అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ 2025ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా నగదుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్‌పై నిషేధం, రియల్ మనీ గేమ్స్‌కు కఠిన నియంత్రణలు అక్రమ బెట్టింగ్, జూదాన్ని అరికట్టే విధానాలు అమల్లోకి వచ్చాయి.
రియల్ మనీ గేమ్స్‌కు స్వస్తి..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో.. వింజో(WinZO), నజారా టెక్నాలజీస్(Nazara Technologies) వంటి ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్ కూడా రియల్ మనీ గేమ్స్‌కు స్వస్తి చెప్పాయి.
8 వేల వెబ్‌సైట్లపై చర్యలు..
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆధ్వర్యంలో బెట్టింగ్, జూదాన్ని ప్రోత్సహిస్తున్న వెబ్‌సైట్లు, విదేశీ సర్వర్ల నుంచి పనిచేస్తున్న అక్రమ ప్లాట్‌ఫామ్స్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్న సైట్లను గుర్తించి ఇప్పటివరకు దాదాపు 8 వేల వెబ్‌సైట్లపై చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
యువత రక్షణే లక్ష్యం..
ఈ చర్యల ప్రధాన ఉద్దేశం యువతను మానసిక, ఆర్థిక నష్టాల నుంచి కాపాడటం, ఆన్‌లైన్ వ్యసనాలకు చెక్ పెట్టడం, సురక్షిత డిజిటల్ వాతావరణం సృష్టించడం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం సూచనల ప్రకారం.. అక్రమ బెట్టింగ్ యాప్‌లపై నిఘా మరింత పెంచనున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్లపై చర్యలు తీసుకోనున్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడే సంస్థలపై కఠిన శిక్షలు విధించనుంది.
ఇవి కూడా చదవండి...
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News