Share News

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. 9న పోలింగ్

ABN , Publish Date - Apr 07 , 2026 | 09:28 PM

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల హామీలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగించాయి.

అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. 9న పోలింగ్
Campaing ends in Assam, Keralam and Puducherry

న్యూఢిల్లీ: అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల హామీలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగించాయి. అస్సాంలోని 126 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళలోని 140, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 9వ తేదీన పోలింగ్ జరుగనుంది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ప్రముఖులు అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల కోసం విస్తృత ప్రచారం సాగించారు.


కేరళలో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) వరుసగా మూడుసారి అధికారం ఆశిస్తుండగా, కాంగ్రెస్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ ఈసారి 100కి పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. లెఫ్టె ఫ్రెంట్ ఒక్క కేరళలో మాత్రమే అధికారంలో ఉండటంతో ఈ గెలుపు వామపక్ష కూటమికి కీలకంగా మారింది. ఇటీవల కాలంలో ఓట్ షేర్‌ను పెంచుకున్న బీజేపీ సైతం గెలుపు అవకాశాలపై నమ్మకం పెట్టుకుంది.


అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉండగా, ఆరు పార్టీలతో జతకట్టిన కాంగ్రెస్ సైతం గెలుపు కోసం పట్టుదలగా ప్రచారం సాగించింది.


పుదుచ్చేరిలో అధికార ఎన్‌ఆర్‌కాంగ్రెస్-బీజేపీ కూటమి, విపక్ష కాంగ్రెస్-డీఎంకే మధ్యనే ప్రధాన పోటీ ఉండగా, ఈసారి నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న ఒకే విడతలో జరుగనుండగా, పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరుగనుంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

తెలంగాణ అభివృద్ధి మోడల్ కేరళలో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతోందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్

Updated Date - Apr 07 , 2026 | 09:31 PM