మత విశ్వాసం న్యాయ సమీక్షకు అతీతమైంది.. శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీం సమీక్షలో కేంద్రం వాదన
ABN , Publish Date - Apr 07 , 2026 | 07:11 PM
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలను కొనసాగించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినదని, ఇందులో విపక్ష లేదని, న్యాయ సమీక్షకు అతీతమైందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: శబరిమల ఆలయం (Sabarimala Temple)లో మహిళల ప్రవేశానికి సంబంధించి ఉన్న ఆంక్షలను కొనసాగించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనానికి విన్నవించారు. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినదని, ఇందులో విపక్ష లేదని, న్యాయ సమీక్షకు అతీతమైందని పేర్కొన్నారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని రద్దుచేస్తూ 2018లో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రక తీర్పు నిచ్చింది. దీనిపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలు కావడంతో సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జీల ధర్మాసనం మంగళవారంనాడు సమీక్షించింది. దీనిపై కేంద్రం తన వాదనలను వినిపించింది.
'అన్ని మత సాంప్రదాయాలను మనం గౌరవించాల్సి ఉంటుంది. ప్రతీదాన్ని ఆత్మ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛతో పోల్చి చూడకూడదు. ఉదాహరణకు తలను కప్పుకుని దర్గాకో, గురుద్వారకో వెళ్లాల్సి వచ్చినప్పుడు నా గౌరవాన్నో, హక్కునో కోల్పోయినట్టు భావించకూడదు' అని మెహతా అన్నారు. నరబలి తప్పనిసరి మతసాంప్రదాయమని ఎవరైనా వాదించినప్పుడు, రాజ్యాగంలోని 32వ అధికరణ కింద కోర్టును ఆశ్రయించినప్పుడు, ఆ సంప్రదాయం అవసరమా? ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యాన్ని దెబ్బతీసే చర్య కింద తోసిపుచ్చాలా? అనే దానిపై కోర్టు సమీక్షించాల్సి వస్తుందన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే నిషేధం విధించారనీ, ఎలాంటి వివక్ష లేదని అన్నారు. ఆలయ సాంప్రదాయలకు అనుగుణంగా శతాబ్దాలుగా భక్తులు స్వామిని పూజిస్తున్నారని, ఇది పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించిన అంశమనీ, న్యాయసమీక్షకు అతీతమైనదని వాదించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను కొనసాగించాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.
శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని 2018 సెప్టెంబర్‌లో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఎత్తివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. దేశంలోని వివిధ ఆరాధానాస్థలాల్లో మహిళలపై వివక్ష సంబంధించి విచారణను విస్తృత ధర్మసానికి అప్పగించాలని 2019 నవంబర్ 14న అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని మరో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రతిపాదించింది. కాగా, ఈ అంశంపై తుది విచారణను ఏప్రిల్ 7న చేపడతామని, ఏప్రిల్ 22 కల్లా విచారణ ముగుస్తుందని గత ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతోందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్
దేశంలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. స్కైమెట్ వెల్లడి