బెంగాల్‌పై కన్నేస్తే పాక్ ఎన్ని ముక్కలవుతోందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:31 PM
కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఆయన చేయకుండా ఉండాల్సిందని, బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని అన్నారు.
బైరక్‌పుర్: కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఘాటుగా స్పందించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఆయన చేయకుండా ఉండాల్సిందని, బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలుగా విడిపోతుందో భగవంతుడికే తెలియాలని అన్నారు.
'పాకిస్థాన్ రక్షణ మంత్రి అలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వకుండా ఉండాల్సింది. 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలైనప్పుడు ఆ పరిణామాలను వాళ్లు చవిచూశారు. ఈసారి కనుక బెంగాల్‌పై కన్నేస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి' అని రాజ్‌నాథ్ చురకలు వేశారు.
భారత్ భవిష్యత్తులో ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా కోల్‌కతాపై దాడి చేస్తామని ఖవాజా ఆసిఫ్ గత శనివారంనాడు నోరుపారేసుకున్నారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర మమతా బెనర్జీ, ఎంపీ అబిషేక్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. కోల్‌కతాపై దాడి చేస్తామని బహిరంగంగా బెదిరించినా ఖవాజా ఆసిఫ్ ప్రకటనలను ఖండించే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు లేకుండా పోయిందని అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఒక ఔన్సు ధైర్యం ఉన్నా కేంద్ర బలగాలకు, బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీకి పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పట్టుకునేందుకు స్వేచ్ఛనివ్వాలని అన్నారు. మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్‌కు ఆ సాహసం ఉందా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ సైతం కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన ఎందుకు హెచ్చరించలేకపోతున్నారు? అని నిలదీశారు. ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ తాజాగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
ఎన్నికలకు ముందు బెంగాల్‌లో పహల్గాం తరహా దాడి జరుగుతుందా?
సీఎం భార్యపై పాస్‌పోర్ట్ ఆరోపణలు.. పవన్ ఖేడా ఇంటికి పోలీసులు