ఎన్నికలకు ముందు బెంగాల్‌లో పహల్గాం తరహా దాడి జరుగుతుందా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:44 AM
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో పహల్గాం తరహా దాడికి బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసిందేమోనని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఇప్పటికే ప్లాన్ రెడీ చేసిందా?
మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో పహల్గాం తరహా దాడికి బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసిందేమోనని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కాకపోతే, కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సోమవారం నదియా జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమె ఈ ఆరోపణ చేశారు. ‘‘పాక్ రక్షణ మంత్రి బెదిరింపులపై మోదీ మౌనం ఎందుకు? భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని ఎందుకు హెచ్చరించలేకపోతున్నారు? మరో ప్లాన్ రెడీగా ఉందా? ఎన్నికలకు ముందు పహల్గాం తరహా దాడి జరుగుతుందా’’ అని వ్యాఖ్యానించారు. మోదీ వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి ప్రణాళిక ప్రకారం జరిగిందని మమత అంటున్నారని, ముస్లింల ఓట్ల కోసమే ఆమె ఈ ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులైన హిందువులను దారుణంగా చంపేశారని బీజేపీ నేత ప్రదీప్ భండారీ గుర్తు చేశారు. టీఎంసీని హిందూ వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో (ఏప్రిల్ 23న, ఏప్రిల్ 29న) పోలింగ్ జరగనుంది.