Share News

45 రోజుల్లోగా సరిహద్దుల్లో కంచె, అవినీతిపరులకు జైలు... అమిత్‌షా

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:04 PM

బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అవినీతి పరులను ఒకరి తరువాత మరొకరిని జైలుకు పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

45 రోజుల్లోగా సరిహద్దుల్లో కంచె, అవినీతిపరులకు జైలు... అమిత్‌షా
Amit Shah

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ (Mamata Banerjee) పాలనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అవినీతి పరులను ఒకరి తరువాత మరొకరిని జైలుకు పంపుతుందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ చొరబాట్లకు కళ్లెం వేస్తూ 45 రోజుల్లోనే రాష్ట్రంలో సరిహద్దు కంచె వేస్తామని చెప్పారు. ఉత్తర 24 పరిగణాల జిల్లా బ్యారక్‌పూర్‌లో శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 39 శాతం ఓట్ షేర్ సాధించిందని, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లు గెలుచుకుని 38 శాతం ఓట్ షేర్ రాబట్టిందని గుర్తుచేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, 50 శాతానికి పైగా ఓట్లను బీజేపీకి గెలుచుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు.


తృణమూల్ కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని, కోల్‌కతాలోని ఆనందపూర్‌లో జరిగిన ఫ్యాక్టరీ ప్రమాదంలో 25 మంది వర్కర్లు అగ్నికి ఆహుతికావడానికి మమతాబెనర్జీ ప్రభుత్వానిదే బాధ్యతని, అది ఎంతమాత్రం ప్రమాదం కాదని, మమత అవినీతే ఈ విషాద ఘటనకు కారణమని ఆరోపించారు. అవినీతిని మమతా సర్కార్ వ్యవస్థీకృతం చేసిందని, రూ.1,000 కోట్లకు పైగా అవినీతి జరిగినా చూసీచూడనట్టు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


వివిధ అవినీతి ఆరోపణలపై టీఎంసీ నేతలు జైళ్లలో ఉన్నారని, ఈసారి కూడా వారికి టిక్కెట్లు ఇస్తారా? అని అమిత్‌షా ప్రశ్నించారు. అవినీతి అంశాల్లో తన మేనల్లుడి పేరు బయటకు రాకుండా జైలులో ఉన్న నేతలందరికీ మమతాబెనర్జీ టిక్కెట్లు ఇవ్వనున్నారని అన్నారు. బెంగాల్ చొరబాట్లు దేశభద్రతకే ప్రమాదంగా పరిణమించనున్నట్టు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత కూడా సరిహద్దు జిల్లాల భూములను బీఎస్ఎఫ్‌కు మమత అప్పగించనే లేదని అన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 45 రోజుల్లోనే సరిహద్దుల్లో కంచె వేసి చొరబాట్ల నుంచి పూర్తి భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

నాకు తెలియదు.. సునేత్రకు డిప్యూటీ సీఎంపై శరద్ పవార్

ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేతగా సునేత్ర పవార్ ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Jan 31 , 2026 | 06:08 PM