అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు.. 50 సీట్లు ఆశిస్తున్న బీజేపీ
ABN , Publish Date - Feb 25 , 2026 | 09:01 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు సంబంధించిన చర్చలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చలకు బీజేపీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యం వహించనుండగా, అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళని స్వామి, సీనియర్ నేతలు పాల్గోనున్నారు.
కాగా, 2024 ఎన్నికల్లో తమ పార్టీ సాధించిన 11 శాతం ఓట్ షేర్ ఆధారంగా బీజేపీ బేరసారాలు జరుపనున్నట్టు తెలుస్తోంది. 50 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు టీటీవీ దినకరన్ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' (ఏఎంఎంకే), మరో రెండు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన దినకరన్ 2018లో ఏఎంఎంకే పార్టీని స్థాపించారు. ఎన్డీయేలోకి తిరిగి రావడానికి బీజేపీనే కారణమని, ఆ పార్టీతోటే తాను సీట్ల సంప్రందింపులు సాగిస్తానని దినకరన్ స్పష్టం చేశారు.
అలాగైతేనే...
సీట్ల పంపకాలపై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, బీజేపీకి 35 సీట్లు, ఏఎంఎంకే వంటి ఇతరులకు 15 సీట్లను పార్టీ కేంద్ర నాయకత్వం కోరనుందని చెప్పారు. 2024లో పార్టీ పనితీరు ఆధారంగానే 2026 ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఉండాలంటూ అన్నాడీఎంకే నాయకత్వానికి తెలియజేశామని, 2021లో ఇచ్చినట్టుగా 20 సీట్లు ఇస్తామంటే తాము అంగీకరించేది లేదని చెప్పారు. ఏఎంఎంకే 8 నుంచి 10 సీట్లలో పోటీ చేయాలనుకుంటోందని, ఏసీ షణ్ముగం 'న్యూ జస్టిస్ పార్టీ', జాన్ పాండియన్ 'తమిళగ మక్కల్ మున్నేట్ర గళం' చెరో రెండు సీట్లు ఆశిస్తున్నాయని, తక్కిన సీట్లు ఇతర పార్టీలకు బీజేపీ కేటాయిస్తుందని చెప్పారు. కాగా, 30 సీట్లకు తాము తగ్గేది లేదని, ఏఎంఎంకే 8 సీట్లయినా కావాలని గట్టిగా చెబుతోందని, దీంతో ఎన్డీయే బ్లాక్‌కు 40-50 సీట్లు కోరనున్నామని బీజేపీకి చెందిన మరో నేత తెలిపారు.
170 సీట్లలో అన్నాడీఎంకే పోటీ
కాగా, అన్నాడీఎంకే సొంతంగా 170 సీట్లలో పోటీ చేసేందుకు పట్టుదలగా ఉంది. బీజేపీకి 25, ఎన్డీయే బ్లాక్‌కు మరో 10 సీట్లు కేటాయించగలమని చెబుతోంది. పీఎంకేకు 17 నుంచి సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. బీజేపీకి 50 సీట్లు ఇవ్వడం చాలా కష్టమని, అయితే సంప్రదింపుల్లో ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదురుతుందని ఆశిస్తున్నామని అన్నాడీఎంకే సీనియర్ నేత ఒకరు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్-మేలో జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3,717 కోట్ల విలువైన ముంబై నివాసం జప్తు
న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్