తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:19 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ ప్రక్రియ, ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నాయి.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly Elections) మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ ప్రక్రియ, ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నాయి. తాజాగా బీజేపీ (Bharatiya Janata Party) సైతం తన అభ్యర్థులను ప్రకటించింది. 27 మందిని షార్ట్ లిస్ట్ చేస్తూ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ-2026 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
వీరిలో మైలాపూర్ నియోజకవర్గం నుంచి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌కు టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్ఠానం. కోయంబత్తూరు నార్త్ నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేయనున్నారు. అవినాశి నుంచి డాక్టర్ ఎల్.మురుగన్‌కు అవకాశం ఇచ్చారు. తిరుప్పూర్ సౌత్ నియోజకవర్గం నుంచి ఎస్.థంగరాజ్, సత్తూర్ నుంచి నైనార్ నాగేంద్రన్, తిరుచెందూర్ నుంచి కె.ఆర్.ఎం.రాధాకృష్ణన్, విలవంకోడ్ నుంచి విజయధారణి పోటీ చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు పొత్తులో భాగంగా మెుత్తం 234 సీట్లకు గానూ బీజేపీకి 27 సీట్లు కేటాయించింది అన్నాడీఎంకే. అయితే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు సీటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
మాల్దా ఘటన ప్రధాన సూత్రధారితో సహా 35 మంది అరెస్టు
ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షం