మాల్దా ఘటన ప్రధాన సూత్రధారితో సహా 35 మంది అరెస్టు
ABN , Publish Date - Apr 03 , 2026 | 03:23 PM
పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలో 'సర్' పరిశీలనకు వచ్చిన ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఘెరావ్ చేసి, దాదాపు 9 గంటల సేపు నిర్బంధించిన ఘటనలో ప్రధాన సూత్రధారి, లాయర్ మోఫక్కరుల్ ఇస్లామ్‌తో సహా 35 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలో 'సర్' పరిశీలనకు వచ్చిన ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఘెరావ్ చేసి, దాదాపు 9 గంటల సేపు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తునకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్ఐఏ టీమ్ దర్యాప్తును ప్రారంభించి ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి, లాయర్ మోఫక్కరుల్ ఇస్లామ్‌తో సహా 35 మందిని అరెస్టు చేసింది. బాగ్డోగ్రా విమానాశ్రయం వద్ద పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఇస్లామ్‌ను అరెస్టు చేసినట్టు బెంగాల్ పోలీసులు చెబుతున్నారు.
కాగా, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై కొందరు నిరసన వ్యక్తం చేయడంతో వారికి సాయపడేందుకు తాను వెళ్లాలని, నిరసనలకు నాయకత్వం వహించలేదని ఇస్లామ్ తెలిపారు. 'కోల్‌కతా నుంచి అలిపుర్దూర్ వెళ్తూ నిరసన ప్రదేశం సమీపంలో ప్రసంగించారు. ప్రధాన ఘటనలో పాల్గొనడం కానీ న్యాయవాదులను ఆపడం కానీ చేయలేదు. నేషనల్ హైవేపై వెళ్తుండగా మేథాబరి వద్ద ఈ ఘటన జరిగింది. అందుకుగాను బాగ్డోగ్రా విమానాశ్రయం వద్ద నన్ను అరెస్టు చేశారు' అని ఇస్లామ్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
మాల్దాలోని కాలియాచక్ వద్ద నిరసనకారులు బుధవారం సాయంత్రం 3.30 గంటలకు సర్ పరిశీలకు వెళ్తుండగా జ్యుడిషియల్ అధికారులను సంఘ వ్యతిరేక శక్తులు ఘెరావ్ చేశాయి. తాగునీరు, ఆహారం లేకుండా తొమ్మిది గంటల సేపు నిర్బంధించాయి. పరిస్థితి తీవ్రం కావడంతో సుప్రీంకోర్టు జోక్యం అనివార్యమైంది. అనంతరం పశ్చిమబెంగాల్ డీజీపీతో కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. లాఠీచార్జి చేసి అల్లరిమూకను చెదరగొట్టి న్యాయాధికారులను విడిపించారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టి పశ్చిమబెంగాల్ అధికార యంత్రాంగాన్ని అభిశంసించింది. దీనిపై విచారణ జరిపిన నివేదిక ఇవ్వాలని, సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలిచ్చింది. బెంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది. కాగా, ఈ ఘటనను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ కుట్ర పన్నినట్టు ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా నిరసన గళం..
అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' విశాఖలో జలప్రవేశం