Share News

బిహార్‌లో 25వేల ఓల్టుల విద్యుత్ తీగ చోరీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

ABN , Publish Date - Jul 09 , 2026 | 08:22 PM

బిహార్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. సుమారు 100 మీటర్ల పొడవైన 25 వేల ఓల్టుల ఓహెచ్ఈ వైర్‌ను కత్తిరించి ఎత్తుకెళ్లారు దుండగులు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బిహార్‌లో 25వేల ఓల్టుల విద్యుత్ తీగ చోరీ.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గయా-పట్నా ప్రధాన రైల్వే మార్గంలోని తేహ్‌తా-జెహానాబాద్ స్టేషన్ల మధ్య సుమారు 100 మీటర్ల పొడవుగల 25 వేల ఓల్టుల ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్(OHE) వైర్‌ను కత్తిరించి ఎత్తుకెళ్లారు. దీంతో గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 3:05 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. దీంతో గయా-పట్నా మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. మరమ్మతులు పూర్తయ్యేవరకు రైళ్లను సింగిల్ లైన్ వర్కింగ్ ద్వారా నడిపించారు. రైల్వే సిబ్బంది ఓహెచ్‌ఈ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఉదయం 6:26 గంటలకు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(RPF) చోరీకి గురైన వైర్‌ను స్వాధీనం చేసుకుంది. సదరు నిందితులను పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.


అయితే.. ఆ రాష్ట్రంలో రైల్వే విద్యుత్, సిగ్నలింగ్ వ్యవస్థల్లో చోరీలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది మేలోనూ దానాపూర్‌లో సిగ్నల్ కేబుళ్లను దొంగిలించడంతో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, శ్రమజీవి ఎక్స్‌ప్రెస్ సహా పదికిపైగా రైళ్లు ఆలస్యంగా నడిచాయి. అంతకుముందు.. 2024 జులైలో ఫతూహా సమీపంలో కూడా సుమారు 39 మీటర్ల ఓహెచ్‌ఈ తీగను దొంగిలించారు. ఈ ఘటనతో నాడు పట్నా-ఝాజ్‌హా మార్గంలో 2 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 2024 ఏప్రిల్‌లో జరిగిన ఇదే తరహా ఘటనలోనూ సుమారు 5 గంటలసేపు రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది.


ఇవీ చదవండి:

న్యూజిలాండ్‌ పర్యటనకు మోదీ.. లక్సన్‌ కీలక ప్రకటన

మెల్‌బోర్న్‌లో మోదీకి ఘన స్వాగతం.. మార్వెల్‌ స్టేడియం 'హౌస్‌ఫుల్‌'

Updated Date - Jul 09 , 2026 | 08:59 PM