Share News

బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:43 PM

అయోధ్యలో రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, బద్రీనాథ్‌లోనూ అలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆలయ ట్రస్ట్.. అంతర్గత విచారణకు ఆదేశించింది.

బద్రీనాథ్‌లో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు
Badrinath

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామ మందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బద్రీనాథ్ ధామ్‌లోనూ ఇలాంటి పుకార్లు జోరందుకున్నాయి. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(BKTC).. అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ మేరకు బీకేటీసీ ప్రెసిడెంట్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ.. 'నిధుల దుర్వినియోగం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తున్నందున విచారణ కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. ఈ వ్యవహారానికి సంబంధించి విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలనూ కోరాం' అని తెలిపారు.


కాగా.. బద్రీనాథ్ ఆలయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని భైరవ సేన అనే ఓ సంస్థ ఆరోపించింది. ఆలయ కమిటీ ఛైర్మన్ వ్యక్తిగత సహాయకుడికి సంబంధమున్న నిధుల దుర్వినియోగం ఆరోపణలపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. అయితే.. దీనిపై ప్రెసిడెంట్ ద్వివేది స్పందిస్తూ.. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత కార్యదర్శిగా పేర్కొన్న వ్యక్తి బీకేటీసీలో ఓ ఉద్యోగి మాత్రమేనన్నారు. ఆయన గతంలో ముగ్గురు మాజీ ఛైర్మన్ల వద్ద పనిచేశారని ఆయన స్పష్టం చేశారు.


ఈ విషయమై బీకేటీసీ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సోహన్ సింగ్ రంగడ్ మాట్లాడుతూ.. 'నిధుల దుర్వినియోం ఆరోపణలు రావడంతో వెంటనే ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాం. కానీ ఆ ఫుటేజీ స్పష్టంగా లేకపోవడంతో పూర్తివివరాలు తెలియరాలేదు. అయినప్పటికీ ఈ విషయం అత్యంత సున్నితమైనదిగా భావించి, ఛైర్మన్‌కు నివేదించాం' అని చెప్పారు. ఛైర్మన్ ఆదేశాలతో సదరు ఉద్యోగుల వివరాలు సేకరించడం సహా వారిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు అంతర్గత కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు. విచారణలో ఎవరైనా తప్పుచేసినట్లు రుజువైతే.. వారిపై బీకేటీసీ చట్టం-1939, ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ అంశం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించినది కావడంతో నిరాధార ఆరోపణలు, తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.


ఇవీ చదవండి:

'ఉపా' చట్టం కింద మరో 23 మంది ఉగ్రవాదుల గుర్తింపు

ఇరాన్ చర్చలపై అమెరికా మీడియా కథనం.. 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసిన ఇజ్రాయెల్

Updated Date - Jul 04 , 2026 | 01:49 PM