టైగర్ ష్రాఫ్ కాల్పుల ఘటనతో వెలుగులోకి అనిల్ పండిట్ పేరు.. ఇంతకీ అతడెవరు?
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:08 AM
టైగర్ ష్రాఫ్‌పై దాడి తమ పనేనని బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అనిల్ పండిట్ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బాలివుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముంబైలోని జుహు సమీపంలో ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే ఈ దాడి తమ పనేనని బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. ఈ విషయాన్ని అదే గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్ ప్రకటించాడు. సల్మాన్ ఖాన్‌తో పని చేయొద్దని చాలాకాలంగా తాము టైగర్ ష్రాఫ్‌కు చెబుతున్నామని, కానీ ఆ యువ నటుడు చెవికెక్కించుకోవడం లేదని అనిల్ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అనిల్ పండిట్ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హరియాణాకు చెందిన అనిల్ పండిట్ నేర చరిత్ర కాస్త పెద్దదే. చాలా కాల్పుల కేసులు అతడిపై ఉన్నాయి. ఒక్క భారత్‌లోనే కాకుండా కెనెడా, థాయ్‌ల్యాండ్, దుబాయ్ దేశాల్లో అనిల్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హరియాణాలో వెలుగు చూసిన అనేక కాల్పుల ఘటనలతో అతడికి లింకులున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్‌లో చేరిన అనిల్ పండిట్.. అమెరికా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడని సమాచారం. అక్కడ షూటర్లతో ఒక నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేశాడని తెలుస్తోంది. వీరి దగ్గర ఆధునిక ఆయుధాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
2026 జూన్‌లో ఢిల్లీలోని ఓ జిమ్‌పైన, ఆ తరువాత ఒక బంగారం దుకాణంపై జరిగిన కాల్పులతో అనిల్ పండిట్‌కు సంబంధముందని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ కేసుల్లో నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలో గాయకుడు దిలేర్ ఖరాకియా కారుపై బెదిరింపుల పేరుతో కాల్పులు జరిపిన కేసుతోనూ అతడికి సంబంధముంది. ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం వెనుకా తమ హస్తమే ఉందని అనిల్ పండిట్ ప్రకటించడంతో అతడి పేరు మరోసారి వార్తల్లో వినిపిస్తోంది.
ఈ వార్తలూ చదవండి
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో