దుర్గాదేవిగా కనకదుర్గమ్మ
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:19 AM
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఆదివారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రిపై రద్దీ
విజయవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఆదివారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గాయని సునీత అమ్మవారిని దర్శించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలన్నీ రాత్రి వరకు నిండుగా కనిపించాయి. సాయంత్రం 6.30 గంటల వరకు 1,03,863 మంది దర్శించుకున్నారు. దేవస్థాన కౌంటర్లలో 3,08,261 లడ్డూలను విక్రయించారు. 1,74,028 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.