లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ
ABN , Publish Date - Aug 12 , 2026 | 04:26 PM
నీట్ పరీక్ష వివాదం.. విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.
ఢిల్లీ, ఆగస్టు 12: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పరీక్ష వివాదం, అనంతర విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన ఒక అధికారిక లేఖ రాశారు.
బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రభుత్వం తరఫున నీట్ అంశంపై చర్చకు అంగీకారం తెలిపారని అమిత్ షా తన లేఖలో గుర్తుచేశారు. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా ఎత్తిచూపడానికి ముందే, ప్రస్తుత సమావేశాల్లోనే 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026' పై సుదీర్ఘ చర్చ జరిగిందని లేఖలో హోం మంత్రి ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో ప్రతిపక్షానికి చెందిన ఏ ఎంపీ కూడా నీట్ పరీక్షల గురించి మాట్లాడలేదని, అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరొకసారి ఈ అంశంపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వివరించారు.
'నా విజ్ఞప్తి ఏమిటంటే... మీరు విపక్షాలతో చర్చించి, పరస్పర అంగీకారంతో నేటి నుంచి ఎంత సమయం, ఎన్ని గంటలు సరిపోతాయని భావిస్తే అంత సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. కేటాయించిన ఆ సమయంలో నేను సభలో స్వయంగా ఉండి, ఈ అంశంపై చర్చలో పాల్గొనడానికి, విపక్షాల ప్రశ్నలన్నింటికీ సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నాను.' అని అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కారాలు లభిస్తాయి.. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై తనకు అపారమైన విశ్వాసం ఉంది.. అలాగే ఈ సభ చర్చలు, సంభాషణల కోసమే ఉందనేది నా నమ్మకమని అమిత్ షా తన లేఖలో రాశారు. కాబట్టి, విపక్ష నాయకులతో చర్చించి, ఈ ముఖ్యమైన విషయంపై మంచి వాతావరణంలో చర్చ జరిగేలా చూడాలని కోరుతున్నానని అమిత్ షా పేర్కొన్నారు. తద్వారా ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలకు చెందిన గౌరవనీయ సభ్యులందరూ తమ అమూల్యమైన అభిప్రాయాలను, ఆలోచనలను సభకు సమర్పించే అవకాశం కలుగుతుందని అమిత్ షా చెప్పారు.

ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News