మేము అధికారంలో ఉన్నంత వరకూ సహించం.. రాహుల్‌కు అమిత్‌షా వార్నింగ్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:58 PM
రాహుల్ గాంధీ ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చని, అయితే బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అగౌరవ పరిచేందుకు అనుమతించమని అమిత్‌షా అన్నారు.
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో ఆమె ఇచ్చిన గమోసా (స్కార్ఫ్)ను రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధరించకపోవడంపై కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) శుక్రవారంనాడు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చని, అయితే బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ ఆయనను ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అగౌరవ పరిచేందుకు అనుమతించమని అన్నారు.
అసోంలోని డిబ్రూగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడుతూ, విదేశీ ప్రముఖులతో సహా అక్కడికి హాజరైన వారంతా గౌరవసూచకంగా గమోసా వేసుకున్నారని, అందుకు నిరాకరించిన ఏకైక వ్యక్తి రాహుల్ మాత్రమేనని అన్నారు. దీనిపై బీజేపీతో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా రాహుల్‌ను తప్పుపట్టారు. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని రాహుల్ గౌరవించడం నేర్చుకోవాలని, లేదంటే ఆయన ఓట్లు అడగరాదని అన్నారు. ఈ ఏడాది అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
నేనే ప్రత్యక్ష సాక్షిని.. నిప్పులు చెరిగిన ఖర్గే
రాష్ట్రపతి విందుకు హాజరైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజా వివాదంపై మండిపడ్డారు. తప్పుడు ప్రచారం ద్వారా రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీయాలని అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోందని, అయితే వారి కుతంత్రాలు ఎప్పటికీ ఫలించవని అన్నారు. 'రక్షణ మంత్రి (రాజ్‌నాథ్ సింగ్) కూడా గమోసా ధరించలేదు. బీజేపీ అధ్యక్షుడు (నితిన్ నబిన్) కూడా అంతే. రాహుల్ గాంధీ గమోసా వేసుకుని ఆ తర్వాత తన చేతితో పట్టుకున్నారు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. బీజేపీ మాత్రం గాంధీ ఈశాన్య రాష్ట్రాలను అవమానించారంటూ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ద్వారా ఆయన ప్రతిష్ట దెబ్బతీసేందు జరిగే ప్రయత్నాలు ఫలవంతం కావు' అని అన్నారు.
వాళ్లే మాకు క్షమాపణ చెప్పాలి
రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సరైన గౌరవం ఇవ్వకుండా కేంద్రం అవమానించిందని ఖర్గే విరుచుకు పడ్డారు. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి పిల్లల వెనుక మూడో వరుసలో రాహుల్‌ను కూర్చోబెట్టారని, కేంద్ర సహాయ మంత్రుల పక్కన కూర్చోబెట్టి తమను అవమానపరిచినందుకు వాళ్లే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు
చరిత్ర సృష్టించనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
For More National News And Telugu News